BC Intellectuals Forum Hyderabad : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తక్షణమే బీసీ కుల జనగణన ప్రక్రియ చేపట్టాలని, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం డిమాండ్ చేసింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ తరపున విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు మాట్లాడారు. బీసీ కుల గణనకు ఆరేడు నెలల సమయం పడుతుందన్న వాదన వాస్తవం కాదని ఆయన తెలిపారు.
బీసీ గణన చేపట్టాలి.. రాష్ట్రంలో బీసీ గణన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీసీ ఇంటలెక్చుల్స్ ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించామని చిరంజీవులు తెలిపారు. గతంలో బీహార్‌లో ఇళ్ల జాబితాల సేకరణ రెండు వారాలు, వాస్తవ గణన మూడు వారాలు చొప్పున మొత్తం ఐదు వారాల్లో బీసీ కుల గణన ప్రక్రియ పూర్తి చేశారని ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో 13 కోట్ల జనాభా, 3 కోట్ల గృహాలు ఉన్నాయన్నారు. అదే తెలంగాణలో 3.5 కోట్ల జనాభా, కోటి ఇళ్లు కాబట్టి అంత సమయం కూడా అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
బీసీ సదస్సు.. సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేసిన ఘనత ఉన్న ప్రభుత్వం, ఓటర్ జాబితాల ద్వారా బీసీలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించారు. మరోవైపు, ఈ విషయంపై విస్తృతంగా చర్చించేందుకు ఈ నెల 30న తాజ్‌కృష్ణ హోటల్లో బీసీ ఇంటలెక్యువల్స్ ఫోరం ఆధ్వర్యంలో "కుల జన గణన - స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపు"పై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నామని ఆయన పేర్కొన్నారు.