Bawaria Chain Snatchers gang Hulchul in Hyderabad: రాష్ట్రంలో భవారియా గ్యాంగ్ మరోసారి విరుచుకుపడింది. హైదరాబాద్ నగర శివార్లలో కిరాతకమైన ధార్ గ్యాంగ్ అలజడి మర్చిపోయే లోపే ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు శనివారం ఒక్క రోజే నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. బైక్ మీద ఇద్దరు దుండగులు వచ్చి చోరీకి పాల్పడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంహైదరాబద్లోని ఇద్దరు దుండగులు నకిలీ రిజిస్ట్రేషన్ నంబరుతో జవహర్‌నగర్ చీర్యాల, శామీర్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా చోరీలు జరిగాయి. ఇవన్ని శనివారం ఒక్కరోజే ఒకే గ్యాంగ్‌కు చెందని నిందితులు చేశారు. తర్వాత వారు గజ్వేల్ వరకూ వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్నారు. గజ్వేల్‌లో కనిపించిన గంటల వ్యవధిలోనే చీర్యాలలో మరో గొలుసు చోరీ చేశారు. తర్వాత ఎటువైపు వెళ్లారో ఆచూకీ చిక్కలేదు. సిద్ధిపేట, రాచకొండ, సైబరాబాద్ సహా వివిధ కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనం అదృశ్యం కేసులపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఇటీవల మహారాష్ట్రలోని సోలాపూర్‌లో భవారియా ముఠా వరసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడింది. వారిలో కొంత మంది వ్యక్తులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.