Bathukamma Celebration In Telangana : పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ! తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ.! తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక. అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే 9 రోజుల పాటు కొలిచే పూల సంబరం. 9 రోజుల పాటు ఘనంగా జరిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలిరోజు జరిగే ఎంగిల పూల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగాయి. పూల వనాలే నడిచివచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరూవాడ బతుకమ్మ ఆడిపాడారు. నెక్లెస్‌రోడ్డులో మంత్రి సీతక్క బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు.
Bathukamma Celebration In Hyderabad :తెలంగాణ ఆడపచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పూల పండగ బతుకమ్మ ఉత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని నారాయణగూడలో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో పాల్గొనడానికి కాలేజీ యువతులు పూర్తి సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టిన వారంతా స్నేహితురాళ్లతో కలిసి పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు.
తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో మొదటి రోజు కాలేజీలో ప్రత్యేక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. నగరవాసులే కాదు ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి విద్యార్థులతో కలిసి పండుగ ప్రత్యేకతను తెలుసుకున్నారు. రోజూ మోడ్రన్ డ్రెస్సుల్లో కాలేజీకి వెళ్లే వీరంతా సంప్రదాయ దుస్తుల్లో రావడంతో అక్కడంతా పండగ వాతారవణం నెలకొంది. మన సంస్కృతీ సంప్రదాయాలను సజీవంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కళాశాల నిర్వాహకులు చెప్పారు.
రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలు : పూలను పూజించే బతుకమ్మ మన రాష్ట్ర అస్తిత్వం అయినప్పుడు, దాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచితే అంత మంచిది అని పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ అన్నారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచం మొత్తంలో పూలను పూజించే పండుగ మనదేనని అందుకు మనం గర్వపడాలన్నారు. సంప్రదాయక రీతిలో బతుకమ్మ సంబరాలు చేసుకోవడం సంతోషకరంగా ఉందని ఆమె అన్నారు. నగర మహిళలతో కలిసి బతుకమ్మ అప్పుడప్పుడు ఆడానని బతుకమ్మ ఆడిన ప్రతిసారీ పరవశించానని తెలిపారు. అనంతరం బతుకమ్మ పాటల సంకలనం ఒక్కేసి పూవేసి చందమామ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.