Bank Employee Died Due to work Pressure in Buchepalli :ఓబ్యాంకులో పని ఒత్తిడి తాళలేక మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన కోట సత్య లావణ్యకు, బత్తుల వీర మోహన్‌తో 5 సంవత్సరాల క్రితం వివాహం అయింది. బాచుపల్లి కేఆర్సీఆర్ కాలనీలోని ఎంఎన్ రెసిడెన్సిలో నివాసం ఉంటున్నారు. భర్త ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
సత్య లావణ్య బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సహాయ మేనేజర్‌గా కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు ఆమె బంధువులకు, మిత్రులకు తెలిపారు. సంక్రాంతి పండుగకు శుక్రవారం సొంతూరు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్లిన ఆమె, నేరుగా అపార్ట్మెంట్ టెర్రస్ పైకి ఎక్కి కిందకు దూకారు. తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆమె మృతి చెందారు. ఈ మేరకు మృతురాలి మేనమామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.