Ban on Sale Of Houses in Dharmapuri : ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో గృహాల క్రయ విక్రయాలపై కొనసాగుతున్న నిషేధం తమకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థంతో పాటు ఆలయ విస్తరణకు గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా దేవాలయం పరిసరాల్లో భూసేకరణ చేపట్టింది. తమ భూమిని ఇచ్చేందుకు కొందరు సహకరించగా మరికొందరు ససేమిరా అంటున్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి ఆలయ ఈవో కొందరి ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చారు. ప్రభుత్వం ఆయా అంశాలపై సమీక్ష చేపట్టి తమ ఇళ్లను నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని బాధితులు వేడుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో వంద కోట్లు ప్రతిపాదించగా 46 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రధాన ఆలయంతో పాటు క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు స్థలం అవసరం కావడంతో సేకరణకు కార్యాచరణ ప్రారంభించింది.
దీని కోసం అప్పటి ఈవో మొత్తం 50 ఇళ్లు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను దేవస్థానం అభివృద్ధికి సేకరిస్తున్నామని వీటి క్రయవిక్రయాలపై నిషేధం విధించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో నిషేధం అమలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ సేకరణ విషయం కొలిక్కి రాలేదు. ఆరేళ్లుగా ఇళ్ల స్థలాలపై నిషేధం కొనసాగుతుంది.
నూతనంగా ఆలయ అభివృద్ధి పనులేవీ ప్రారంభం కాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఆయా యజమానులు అవసరాల నిమిత్తం ఇళ్లను విక్రయిద్దామన్నా నూతనంగా నిర్మించాలనుకున్నా వీలు కాని దుస్థితి నెలకొంది. అప్పటి అధికారుల సమన్వయ లోపం, అనాలోచిత నిర్ణయాల వద్ద ఏళ్ల తరబడి ఈ స్థలాల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.