Balkampet yellamma temple Issue :బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహణ కోసం నూతనంగా దేవాదాయ శాఖ ప్రకటించిన ఉత్సవ కమిటీని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఈవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కమిటీని రద్దు చేయాలని కోరుతూ ఈవో అంజనీదేవికి వినతిపత్రం సమర్పించారు.
స్థానికేతరులను నియమించడంపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం :సనత్నగర్ నియోజకవర్గం ఇంఛార్జ్ చోట నీలిమ పంపిన పేర్లు కాకుండా స్థానికేతరుల పేర్లు ప్రకటించడం సరైనది కాదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 14 మంది పేర్లతో కూడిన జాబితాను పంపిస్తే కేవలం 11 మందితో ఉత్సవ కమిటీని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ స్థానికులను అవమానించడమేనని శ్రీనివాసరావు, శంకర్ గౌడ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
9 మంది స్థానికేతరులనే నియమించారు :కేవలం 5 మంది స్థానికులకు అవకాశం ఇస్తూ 9 మంది స్థానికేతరులను కమిటీలో నియమించడం గ్రూపులను ప్రోత్సహించడమేనని దుయ్యబట్టారు. ఈ కమిటీని రద్దు చేయాలని కోరుతూ ఈవో అంజనీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదాస్ నవీన్, కడవారి లక్ష్మన్, పద్మావతి, ఆండాల్, సుకన్య, రాజా పద్యరాణి, అనితా సింగ్ తదితరులు ఉన్నారు.