Argument Between Two Groups Over Transportation of Sand :కృష్ణా నదిలో ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా 2 గ్రామాలకు మధ్య చిచ్చు పెట్టింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో పెసర్లంకలో చోటుచేసుకుంది. ఈ విషయమై స్థానికులకు, ఇతర గ్రామస్థులకు వాగ్వాదం జరిగింది. పెసర్లంక సమీపంలోని కృష్ణా నది నుంచి రెండు రోజులుగా చుట్టుపక్కల గ్రామాల వారు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తీసుకెళ్లాలంటే 500 రూపాయలు శివాలయం మరమ్మతులకు చెల్లించాలని గ్రామానికి చెందిన కొందరు షరతులు విధించారు. దీంతో ఓ ట్రాక్టర్ యజమాని తన వాహనాన్ని కొల్లూరు లాకుల కూడలిలో రహదారిపై అడ్డుగా పెట్టి నిరసన తెలిపాడు.
అతనికి మద్దతుగా మరికొందరు ట్రాక్టర్లను రహదారిపై నిలపడంతో 2 గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పాఠశాల నుంచి విద్యార్థులను ఇళ్లకు చేరవేసే బస్సులు, ఆర్టీసీ బస్సులతో పాటు పలు వాహనాలు రోడ్డుపై పదుల సంఖ్యలో నిలిచి పోయాయి. రెండు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గా లను చెదరగొట్టి, రహదారికి అడ్డుగా నిలిపిన వాహనాన్ని తొలగించారు. పెసర్లంకకు చెందిన సాతా శివప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.