TDP Leaders Celebrate Minister Nara Lokesh Birthday: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ 42వ జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు పండుగలా చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవి కేక్ కట్ చేశారు.
గుంటూరులో టీఎన్ఎస్ఎఫ్(TNSF) ఆధ్వర్యంలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయించారు. చిలకలూరిపేటలో కార్యకర్తలు లోకేశ్ మాస్కులు ధరించి బైకు ర్యాలీ చేశారు. చీరాల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ పంపిణీ చేయగా, టీడీపీ నేత మహంతి వాసుదేవరావు రెండు నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవల వరదలకు నష్టపోయిన దుకాణదారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిహారం అందించారు. కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లోకేశ్పేరుతో కొబ్బరికాయలు కొట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఎఫెక్ట్- గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కోసం నిధుల విడుదల
1000 మందికి పైగా కార్యకర్తలు రక్తదానం: పశ్చిమ గోదావరి జిల్లా మంచిలిలో టీడీపీ నేతలు ఆలయాలు, స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు, పేదల కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. భీమవరంలో అన్నదానం, వస్త్రదానం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ పాఠశాల విద్యార్థులు హ్యాపీ బర్త్ డే లోకేశ్ సర్ అనే ఆకారంలోకి కూర్చుని శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరంలో 1000 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి, ఆమె సోదరి విద్యావతి రక్తదానం చేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి మోకాళ్లపై నరసింహస్వామి సన్నిధికివెళ్లి పూజలు చేశారు. అనంతపురం ఆటో ర్యాలీలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎమ్ఎస్ రాజు స్వయంగా ఆటోలు నడిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తిరుపతిలో అలిపిరితోపాటు శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టగా, తిరుమలలోని అఖిలాండం వద్ద 511 కొబ్బరికాయలు కొట్టి రెండు కేజీల కర్పూరం వెలిగించారు.
ప్రజాసేవకు లోకేశ్ బ్రాండ్ అంబాసిడర్: సంక్షేమం, అభివృద్ధి, ప్రజాసేవకు యువ నాయకుడు లోకేశ్ బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. లోకేశ్ సారథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న పార్టీ నేతల వ్యాఖ్యలపైనా పల్లా శ్రీనివాసరావు స్పందించారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ కుట్ర చేస్తోందని అందరూ అప్రమత్తంగా ఉండాలని హితవుపలికారు.
పెట్టుబడుల వేటలో లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు