CM Chandrababu Davos Tour: ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు.
ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో: ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం విజయవంతమైంది. రాష్ట్రంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవవనరులు, పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాలముందుంచింది. ప్రపంచం దేశాల నుంచి దావోస్‌కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు.
వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
ప్రపంచానికే మన దేశం టెక్నాలజీని అందజేస్తోంది : సీఎం చంద్రబాబు
తొలి రోజు సాగింది ఇలా: వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తొలి రోజు పర్యటనలో జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం చర్చించారు. దావోస్‌కు వెళ్లేముందే స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు. స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ ఫిస్టర్, స్విస్ టెక్స్‌టైల్స్ సీఈవోలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
ఇన్నోవేషన్ హబ్‌లు - ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు, శిక్షణ కార్యక్రమాలకు ‘స్విస్‌మెన్’ కంపెనీ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని ఓర్లికాన్ అనే సంస్థకు తెలిపారు. జ్యూరిచ్లోనే తరలివచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతోనూ ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఏపీ తెలంగాణా ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై చర్చించుకున్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టండి - గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం
రెండో రోజు పర్యటన: ఇక దావోస్‌లో రెండోరోజు భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం వివరించారు. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలో ఏర్పాటు చేయబోయే గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. డెన్మార్క్‌కు చెందిన మార్స్కే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపర్చింది. ఏపీలో విస్తారంగా ఉన్న పోర్టులను వినియోగించుకోవచ్చని సీఎం ఆ సంస్థ సీఈఓ విన్సెంట్ క్లర్క్‌కు వివరించారు. అటు సిస్కోని కూడా డేటా సెంటర్లు, నెట్వర్క్ విడి భాగాల తయారీకి ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ ఎల్జీ కెమ్తోనూ సీఎం చర్చలుజరిపారు. అనుబంధ సంస్థ ఎల్జీ కెమ్ ఎనర్జీ ఏపీలో నెలకొల్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్‌గా ఉండాలని అభ్యర్ధించారు.
పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు.
ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఏపీ రైతులతో భాగస్వామి కావాలని కోరారు. అలాగే అనకాపల్లిలో 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు కానున్న ఇంటిగ్రేటెడ్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తోనూ సీఎం భేటీ అయ్యారు.
అప్పుడు ఐటీ - ఇప్పుడు ఏఐ: బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశం
దావోస్‌లో మూడో రోజు: దావోస్‌లో మూడో రోజు గూగుల్ క్లౌడ్ సీఈఓ కురియన్ తోనూ చంద్రబాబు భేటీ అయి సర్వర్ల కోసం సొంతంగా చిప్ తయారీ డిజైన్ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని అన్నారు. మలేషియాకు చెందిన పెట్రోనాస్ సీఈఓతో బేటీ అయ్యారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడ ప్లాంటులో రూ. 15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ భాగస్వామి కావాలని సీఎం కోరారు.
ఇక పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ ఛైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్ విశాఖపట్నంని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్‌కురే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సీకో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్‌ఎఫ్‌తో భాగస్వామ్యం కావాలని కోరారు.
బిల్‌గేట్స్‌తో భేటీ అయిన సీఎం ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని అభ్యర్ధించారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, అలాగే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో సూచనలు చేయాలని కోరారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. హిందుస్తాన్ యూనీలీవర్ సంస్థ ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఏపీలో రూ.330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న యూనిలీవర్‌ను బ్యూటీ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా
ఉంటుందని సీఎం సూచించారు.
ఏపీలో పెట్టుబడులకు విస్తృత ప్రయత్నాలు - 15కు పైగా సంస్థలతో సీఎం వరుస భేటీలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో సమావేశమైన ముఖ్యమంత్రి, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ - స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు. సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకురావాలని డీపీ వరల్డ్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు.
పర్యటనలో చివరిగా దావోస్ వేదికగా ఇండియన్ పెవిలియన్‌లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలు పోటీ పడుతున్నా టీమ్ ఇండియాగా పనిచేయనున్నట్టు సీఎం వెల్లడించారు. సుస్థిరమైన వృద్ధిరేటు, ఆధునిక సాంకేతికత, పనిచేసే యువత భారత్ బలమని సీఎం వ్యాఖ్యానించారు. 2047 నాటికి అగ్రగామి ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. పునరుత్పాదక విద్యుత్‌లో ఏపీ కీలకంగా మారుతుందన్నారు. దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగివచ్చేంత వరకూ సీఎం వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూనే ఉన్నారు. నాలుగోసారి సీఎం అయిన తరువాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన సంతృప్తినిచ్చిందని, రానున్న రోజుల్లో ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు ఏపీ హబ్‌గా మారబోతోంది: సీఎం చంద్రబాబు