NH-150A Issue in Anantapur District : తమ గ్రామంలో వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలకు వీలుగా పిల్లర్ వంతెన ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా డి. హిరేహాల్ గ్రామస్థులు పట్టుబట్టారు. బళ్లారి- తుమకూరు మధ్య వెళ్లే NH -150Aపై వంతెన నిర్మిస్తే ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు తెలిపారు. దీంతో పలుమార్లు జాతీయ రహదారిపై జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. గ్రామంలో తప్పనిసరిగా పెద్దవంతన నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.
వంతెన కోసం గ్రామస్థుల డిమాండ్ : అయితే ఇదివరకే జాతీయ రహదారి కంట్రోల్ అధికారులు డి. హిరేహాల్ మండల కేంద్రంలో ఒక వాహనం వెళ్లడానికి చిన్న రహదారితో ఫ్లైఓవర్ బ్రిడ్జిని డిజైన్ చేశారు. కానీ మండల కేంద్రం నుంచి కర్ణాటకలోని వివిధ గ్రామాలకు వెళ్లడానికి చిన్న వంతెన సరిపోదని, జాతీయ రహదారి ఫ్లైఓవర్ని కింద పిల్లర్లు ఏర్పాటు చేసి రాకపోకలకు వీలుగా పెద్ద వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇప్పటికే పలమార్లు జాతీయ రహదారి వంతెన పనులను డి. హిరేహాల్ గ్రామ ప్రజలు, మండల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి నెలలో దిల్లీకి : విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, కర్ణాటకలోని బళ్లారి ఎంపీ తుకారాం డి. హిరేహాల్ మండల కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చర్చల అనంతరం బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలో అధిక భాగం కర్ణాటక ప్రాంతంలో ఉండటంతో బళ్లారి ఎంపీ తుకారాం, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి వచ్చే నెల ఫిబ్రవరిలో దిల్లీ వెళ్లి నేషనల్ రోడ్స్ అథారిటీ ఉన్నతాధికారులను కలవనున్నట్లు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు.
జాతీయ రహదారిలో పిల్లర్ వంతెన ఏర్పాటు చేస్తే రాకపోకలకు వీలు కలుగుతుందని, ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని స్థానిక ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎలాగైనా పెద్దవంతెన నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని మండల ప్రజలు కోరారు.
జాతీయ రహదారులకు మోక్షం- రూ.5,417 కోట్లతో విస్తరణ పనులు
ఆ ఊరిని వణికిస్తున్న హైవే - చీకటిపడితే చాలు గ్రామస్థుల్లో గుబులు