Argument between Tehsildar and woman :నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం వారం రోజులుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేసారిన యువతి ఇవాళ అధికారిణితో వాగ్వాదానికి దిగింది. స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో తండ్రి, కుమారై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కోసం హేమావతి అనే యువతి తన తండ్రితో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఐదు రోజులగా తిరుగుతున్నా సర్టిఫికెట్‌పై సంతకం చేయలేదని రోదిస్తూ ఇవాళ తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.
తహసీల్దార్ సంతకం చేయకుండా దబాయిస్తోందని :నారాయణపురం గ్రామానికి చెందిన అయ్యన్న కూతురు హైమావతి తన అక్క నర్సింగ్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ అవసరమని అందుకోసం వచ్చినట్లు తెలిపింది. వారం రోజుల క్రితం కోసం తహశీల్దార్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. ఐదు రోజులుగా తిరుగుతున్నా ఇంతవరకు సర్టిఫికెట్ మీద సంతకం చేయలేదంటూ అడిగితే ఇప్పుడు పెట్టేది లేదంటూ దబాయిస్తోందని హైమావతి వాపోయింది.
సహనం కోల్పోయిన తండ్రీ, కూతురు :స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ ఆఖరు రోజు కావడంతో తండ్రీ, కూతురు సహనం కోల్పోయారు. తహశీల్దార్ తీరుపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తామంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అయ్యిండి కూడా ప్రజలను ఇలా వేధించడం సరికాదని వాపోయారు. రోజు అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కార్యాలయంలో ఉన్న సిబ్బంది కలగజేసుకొని తహశీల్దార్‌కు నచ్చజెప్పడంతో ఆమె సర్టిఫికెట్ మీద సంతకం చేశారు. ఐదు రోజులుగా రోజూ వస్తున్నా సంతకం చేయకుండా వేధించిందని హైమావతి వాపోయింది.