తెలంగాణ

telangana

ETV Bharat / state

అలాంటి రీల్స్ చూస్తున్నారా? - ఐతే బీ కేర్​ఫుల్ - వాళ్లకు దొరికితే నిండా మునగడం ఖాయం! - LOAN APP FRAUDS IN INSTAGRAM REELS

లోన్​యాప్​ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పేద ప్రజలు - ఏపీకే ఫైల్స్ పంపించి మరీ యాప్​ల ఇన్​స్టాల్స్ - వడ్డీ పేర్లతో బాధితులను బెదిరించి అక్రమంగా డబ్బుల వసూళ్లు

CYBER CRIME RISING IN TELANGANA
CHEATING WITH LOAN APPS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 1:35 PM IST

Loan App Frauds in Instagram Reels : లోన్‌ యాప్‌ల మోసాలు మళ్లీ పెరుగుతున్నాయి. రిజర్వుబ్యాంకు, పోలీసుల చర్యలతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మోసగాళ్లు, ఇప్పుడు కొత్త రూపంలో యాప్‌లను తీసుకొస్తున్నారు. గతంలో గూగుల్‌ ప్లేస్టోర్, ఐస్టోర్‌లలో యాప్‌లు ఉండేవి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో రీల్స్, ప్రకటనలు, ఏపీకే ఫైళ్ల ద్వారా యాప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు.

కుటుంబ అవసరాల కోసం ఈ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుంటున్న చిరుద్యోగులు, కూలీలు వడ్డీలపై వడ్డీలు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్​కు చెందిన ఓ యువకుడు (23) వేధింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడకు చెందిన డ్రైవర్‌ అదృశ్యమయ్యారు.

ఇదీ పరిస్థితి :నిజానికి యాప్‌లు ప్లేస్టోర్, ఐస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లోన్‌యాప్‌ల ఆగడాలు పెరగడంతో ఆర్​బీఐ గతంలో దాదాపు 2700 యాప్​లను బ్యాన్​ చేసింది. నగర పోలీసులు కూడా 500 వరకూ యాప్‌లు తొలగించారు. దీంతో సైబర్​ నేరగాళ్లు ఈ స్టోర్లతో సంబంధం లేకుండా యాప్‌లను ఏపీకే ఫైళ్ల రూపంలో వాట్సాప్​లో పంపిస్తున్నారు. లోన్‌యాప్‌లో రుణాలు తీసుకునే వారిలో యువతే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఫెడెక్స్‌ మోసాల్లోనూ :సైబర్‌ నేరగాళ్లు ఫెడెక్స్, డ్రగ్‌ పార్శిల్, ఈడీ కేసుల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతాల్లోనే ఎక్కువగా లోన్‌యాప్‌ల ప్రమేయం బయటపడుతోంది. సైబర్‌ నేరగాళ్లు బాధితులకు ఫోన్‌ చేసి బెదిరించినప్పుడు తమ ఖాతాలో ఉన్నదంతా బదిలీ చేశామని, తమ దగ్గర ఇక డబ్బులేదని బతిమిలాడుతుంటారు. ఇలాంటి సయయాల్లో సైబర్‌ నేరగాళ్లు లోన్‌ యాప్‌లో రుణం తీసుకుని డబ్బు పంపాలంటూ కొన్ని లింకులు పంపిస్తున్నారు. ఇటు సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులు, ఓ పక్క లోన్‌ యాప్‌ల వేధింపులు తట్టుకోలేక బాధితులు నరకం చూస్తున్నారు.

తాజా ఘటనలు

  • జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి దమ్మాయిగూడకు చెందిన వ్యాపారి (42) గత ఏప్రిల్‌ 29న లోన్‌యాప్‌ నుంచి రూ.3 వేలు రుణం తీసుకుని వారం రోజుల్లో వడ్డీతో చెల్లించారు. లోన్‌యాప్‌ వారు ఇంకా రుణం బకాయి ఉన్నావంటూ ఫోన్లు చేసి బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు నగ్నంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పెడతామన్నారు. భయపడ్డ వ్యాపారి రూ.25.60 లక్షలు పంపించారు.
  • రంగారెడ్డి జిల్లాలోని నందిగామకు చెందిన వినోద్‌ కుమార్‌ (34) లోన్‌యాప్‌లో కేవలం రూ.2,514 రుణం మాత్రమే తీసుకున్నారు. చెల్లించడం ఆలస్యమవడంతో అతని బావమరిది రుణం చెల్లించారు. నేరగాళ్లు మాత్రం ఇంకా డబ్బు కట్టాలంటూ ఫోన్‌లో ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అందరికీ పంపడంతో మనస్తాపానికి గురై తన పెళ్లి రోజున ఉరేసుకున్నాడు.

ఏపీకే ఫైల్స్‌ ఎందుకంటే :సాధారణంగా యాప్‌లు పరిమితి ఉన్నంత వరకే ఫోన్‌లో ఉన్న డేటాను సేకరిస్తాయి. నేరగాళ్లు పంపించే ఈ ఏపీకే ఫైళ్లు మాత్రం ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, ఫోన్‌ నంబర్ సహా అన్నీ సేకరిస్తాయి. వివిధ అవసరాల కోసం పలువురు రుణాలు తీసుకుంటారు. వేధింపులు ఉంటాయని తెలిసినా, తర్వాత చూసుకుందామని ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేసి మరీ రుణం తీసుకుంటున్నారు.

దీంతో డేటా మొత్తం వీరు తమ గుప్పిట్లోకి తీసుకుని రుణం ఇచ్చి దానికి డబుల్​ వడ్డీ వసూలు చేస్తున్నారు. కొన్నిసార్లు డబ్బు అడగకున్నా పంపి కట్టలేదంటూ వసూలు చేస్తున్నారు. బాధితుల ఫోన్లలోని ఫొటోలను నగ్నంగా మార్చి బెదిరించడం, పదే పదే ఫోన్లు చేసి వేధించడం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో రీల్స్‌ రూపంలో ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ప్రకటనల మీద వచ్చే లింకులు క్లిక్‌ చేయగానే లోన్‌యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయి.

అత్యవసరంగా డబ్బులు కావాలా? ఇన్‌స్టాంట్‌ పర్సనల్ లోన్ పొందండిలా!

రూ.50లక్షల లోన్​తో బిజినెస్ స్టార్ట్​- ఇప్పుడు రూ.వేల కోట్లకు అధిపతి- కల్యాణ్​ జ్యువెలర్స్ MD సక్సెస్​ ఇలా!

ABOUT THE AUTHOR

...view details