Araku Utsav To be Held After Fiver Years in Andhra Pradesh :ఏపీలోవైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా నిర్వహించే అరకు ఉత్సవ్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో అరకు సందర్శనకు వచ్చే పర్యాటకుల్లో కొంతమేర జోష్ తగ్గింది. కూటమి ప్రభుత్వం రాకతో పర్యాటకానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. వచ్చే నెలాఖరులో మూడు రోజుల పాటు అరకు ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానికులు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అరకు ఉత్సవ్‌ను ప్రారంభించారు. ఐదేళ్ల పాటు ఈ కార్యక్రమం నిరాటంకంగా జరిగింది. 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఉంటాయి. శ్రీకాకుళం సవర, కొమ్ముబూర, కోయ నృత్య ప్రదర్శనలు, స్ట్రీట్ డ్యాన్స్‌లు, అరకు ప్రాంతంలోని థింసా, పులి వేషాలు, ఏర్పాటు చేసేవారు. స్థానిక కళాకారులు, విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా వివిధ అంశాల్లో స్కూల్, కాలేజీ స్థాయిల్లో పోటీలు నిర్వహించేవారు. మూడు రోజుల పాటు అరకు లోయ ప్రధాన రహదారి, పర్యాటక ప్రాంతాలు విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోయేవి.
మంచువేళల్లో అరకు అందాలు - తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ!
వ్యాపారుల హర్షం :ఐదేళ్ల తర్వాత అరకు ఉత్సవ్‌ను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అరకు లోయ పర్యాటకుల్లో కొత్త జోష్ వచ్చింది. ఉత్సవ్‌లో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్, సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, ఆటలు నిర్వహించనున్నట్లు జిల్లాధికారి దినేశ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం అరకులో టూర్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే వారాంతంలో టూరిస్టులు పోటెత్తుతున్నారు. అరకు ఉత్సవ్‌తో అరకు లోయకు మరింత ఎక్కువ సంఖ్యలో సందర్శకుల తాకిడి పెరుగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగితే తమ వ్యాపారాలు బాగా సాగుతాయని చెబుతున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు : జనవరి 31 నుంచి 3 రోజుల పాటు అరకు ఉత్సవాలు ఘనంగా జరపనున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో పర్యాటక అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మారేడుమిల్లి ఉత్సవాలు ఫిబ్రవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అరకు, బొర్రాగుహలను ప్లాస్టిక్ ఫ్రీ డెస్టినేషన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ప్లాస్టిక్ నీటి సీసాలైనా నిషేధం అని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే టూరిస్టులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అరకు, మారేడుమిల్లి ఉత్సవాల నిర్వాహణకు రూ.3 కోట్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు.
అరకు టూర్‌కు వెళ్తున్నారా? - ఇది తప్పక ట్రై చేయండి
అరకు అందాలు చూసొస్తారా? తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ! ధర చాలా తక్కువ! - Hyderabad to Araku Tour Package