Aqua Farmers Problems :భారీ వరద కృష్ణా జిల్లాలోని ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో నదీ పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. ఆటు పోట్లుకు సముద్రం ఉప్పునీరు సుమారు 30 కిలోమీటర్ల వరకు కృష్ణానదిలోకి వస్తుంది. రొయ్యల సాగుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంతో నది, కరకట్టకు మధ్యన ఉన్న భూ భాగాన ఎక్కువగా వీటిని సాగు చేస్తున్నారు. దివిసీమలో సుమారు 20,000ల ఎకరాల్లో వీటిని సాగు చేశారు.
గత సర్కార్ విద్యుత్ సబ్సిడీలో రాయితీలు ఇవ్వకపోవడంతో చెరువుల్ని కొంతమంది లీజుకు ఇవ్వగా మరికొందరు ఖాళీగా వదిలేశారు. ఇంకొందరు రొయ్యల అమ్మకంలో ఇబ్బందులు మేత ధరలు ఇతర కారణాల వల్ల వాటిని సాగు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో వేలాది మంది మళ్లీ రొయ్యల సాగు మొదలు పెట్టారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఉగ్రరూపంతో ఉరకలెత్తిన కృష్ణమ్మ చెరువుల్ని ముంచేసి రైతుల ఆశల్ని చిదిమేసింది.
"వరద వచ్చి చెరువులన్ని మునిగిపోయాయి. మాకు లక్షల్లో నష్టం వాటిల్లింది. రొయ్యలన్ని చనిపోయాయి. అప్పులు తెచ్చి మరి పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు అవి కూడా వచ్చే పరిస్థితి లేదు. మేత కట్టలు, మందులు, విద్యుత్ పరికరాలు పాడైపోయాయి.పెట్టుబడంతా నీటి పాలైంది. మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం. - బాధిత ఆక్వా రైతులు