APSRTC Bus Ticket Concession for Senior Citizens : ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులకు ఇస్తున్న రాయితీ టికెట్లపై ఆ సంస్థ మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. టికెట్ల విషయమై పాటించాల్సిన నియమాలను సిబ్బందికి వివరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్నీ జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని ఆర్టీసీ బస్సులో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పట్నుంచో టికెట్ ధరలో 25 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధారణకు గుర్తింపు కార్డు చూపించకపోవడంతో ఆ సంస్థ సిబ్బంది, ప్రయాణించే వృద్ధుల మధ్య బస్సుల్లో వాగ్వాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
ఫిర్యాదుతో సిబ్బందికి మరోసారి ఆదేశాలు : ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటనే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది రాయితీ టికెట్లు జారీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను సైతం అంగీకరించడం లేదు. ఒరిజినల్ కార్డులు లేకపోతే డిజిటల్ కార్డులు కూడా చూపించవచ్చని ప్రభుత్వం తెలిపినా అవగాహన లేమితో ఆర్టీసీ సిబ్బంది టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల నుంచి వృద్ధులు దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ మరోసారి రాయితీ టికెట్ల జారీ విషయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను సిబ్బందికి తెలియజేస్తూ సమగ్ర ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు వృద్ధుల వయసు నిర్ధారణ కోసం ఆరు రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని తాజాగా ప్రకటించింది.