Apaar Card For Students to Track Academic Progress Regularly :దేశంలోని ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డు ఉంది. ప్రస్తుతం నిత్య జీవితంలో ఆధార్ గుర్తింపు సంఖ్య భాగమైపోయింది. ఈ గుర్తింపు లేనిదే ఏ పనులు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే విధంగా దేశంలోని ప్రతీ విద్యార్థికి 12 అంకెల జీవితకాల గుర్తింపు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డును తీసుకొస్తోంది. విద్యార్థుల అకడమిక్ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి అభ్యసనను మరింత సమర్థంగా నిర్వహించడానికి సహాయపడే విధంగా ప్రత్యేక గుర్తింపును ఆవిష్కరించాలని జాతీయ విద్యా విధానం 2020 యోచించడంతో అందుకు తగ్గ అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అపార్ సమ్మతి పత్రాలను అందజేశారు.
ప్రయోజనాలు
- వివిధ కారణాలతో పిల్లలు పలు విద్యా సంస్థలకు మారుతూ ఉంటారు. అపార్ గుర్తింపు సంఖ్య వివిధ రాష్ట్రాల్లోని విద్యా బోర్డులతో ఏకీకృత వ్యవస్థగా పనిచేస్తుంది. ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు.
- అపార్ గుర్తింపుతో విద్యార్థులు డిజిలాకర్‌కు అనుసంధానమవుతారు. విద్యా విషయక విజయాలు, ధ్రువపత్రాలు డిజిటల్ రూపంలో సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. ఆయా ధ్రువపత్రాలను ఎక్కడైనా డిజిటల్ రూపంలో వినియోగించుకోవచ్చు.
- పిల్లల అకడమిక్ రికార్డుల పర్యవేక్షణ ద్వారా డ్రాపవుట్లను నివారించే అవకాశం ఏర్పడుతుంది. ఏ కారణం చేతనైనా విద్యార్థి పాఠశాలకు దూరమైతే తక్షణమే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- రాబోయే రోజుల్లో ఉపకార వేతనాలు, వివిధ ప్రభుత్వ ప్రయోజన పథకాలు, దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో చేరికలు, మార్పులు వంటి అన్ని ప్రక్రియలు ఈ అపార్ ఆధారంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేశారు.
- విద్యార్థులు తమ అకడమిక్ రికార్డులను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. విద్యా సంస్థల మధ్య సులభమైన బదిలీలు, ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ వ్యవస్థ రియల్ టైం విధానంలో నవీకరించిన ధ్రువపత్రాలను అందిస్తుంది. ఈ విధానం వల్ల నకిలీ ధ్రువపత్రాల బెడద నిర్మూలించే అవకాశం ఉంటుంది.