Minister Nara Lokesh Visit AP Polytech Fest: నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లాలని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అప్పుడే అనుకున్న టార్గెట్‌ను సాధించగలుగుతారని స్పష్టం చేశారు. తాను విద్యాశాఖను ఛాలెంజ్‌గా తీసుకున్నానని అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
విద్యా శాఖలో సంస్కరణలు తీసుకురావడం సవాల్‌గా తీసుకుని బాధ్యతలు స్వీకరించానని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. రానున్న 4 ఏళ్లలో 8 వేల కోట్ల పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాజధాని ఒకే దగ్గర ఉండి అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని చోట్లా జరగాలన్నది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
విద్యార్థులు తయారుచేసిన వివిధ ప్రయోగాలు పరిశీలించిన లోకేశ్, వినూత్న ప్రయోగాలు చేసిన విద్యార్థులను అభినందించారు. అనంతపురం ఆటోమొబైల్ హబ్ గానూ, కర్నూల్‌ని డ్రోన్ హబ్ గానూ, కడప, చిత్తూరు జిల్లాలను ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో బయో ఫీల్డ్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రతీ నగరంలో విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు పైలట్ ప్రాజెక్టులు చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తెస్తామన్నారు.
మన చుట్టూ ఉండే స్ఫూర్తి నిచ్చేవారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పాలిటెక్ ఫెస్ట్ 2018 చంద్రబాబు ఆలోచనల్లో నుంచి వచ్చిన కార్యక్రమం అని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో విద్యార్థులు ప్రతిభ అపారమని 1256 ప్రాజెక్టుల్లో 243 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చారని అభినందించారు.
"ముఖ్యమంత్రి గారు మీరు ఏ శాఖ ఆశిస్తున్నారు అని అడిగినప్పుడు, నాకు విద్యాశాఖ ఇవ్వండి అని అడిగాను. అది చాలా కష్టమైన శాఖ అని అప్పుడు ఆయన అన్నారు. చాలా సంఘాలు ఉంటాయని తెలిపారు. నువ్వు తట్టుకోగలవా అని అడిగారు. అందుకే నాకు ఆ శాఖ కావాలి అని చెప్పాను. నేను విద్యాశాఖ తీసుకుంటున్నాను అని తెలిసి చాలామంది మెసేజ్ చేశారు. చాలా కష్టమైన శాఖ అని. అందుకే నేను దానిని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా, ప్రతి ఒక్కరూ ఏదైనా సరే ఛాలెంజ్‌గా తీసుకోండి. దాని కోసం కష్టపడండి. విజయం కోసం హార్డ్ వర్క్‌కి మరో రీప్లేస్ లేదు. నమ్ముకున్న దాని కోసం కష్టపడాల్సిందే". - నారా లోకేశ్, మంత్రి
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ - రెండు సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ