Medical Tests for Police in Srikakulam: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించి, 24 గంటల పాటు సేవలందించే పోలీసులకు కష్టమొచ్చింది. రాజకీయ నాయకుల పర్యటనలు, బందోబస్తు, ప్రముఖులకు గన్‌మెన్లుగా, క్లూస్ టీం, ఎస్కార్ట్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ వంటి పలు విభాగాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. సమయానికి భోజనం, నిద్రలేక రోగాల బారిన పడుతున్నారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఎక్కవ శాతం మంది పోలీసులు ఊపిరితిత్తులు, గుండె, లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, రక్తపోటు(Blood pressure), మధుమేహం(Diabetes) వంటి రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించాలని ఉన్నతాధికారులు పూనుకున్నారు. ప్రభుత్వ సూచన మేరకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 2 ఆసుపత్రుల్లో వీరందరికీ పరీక్షలు చేయించగా వారి ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
రకరకాల వ్యాధులతో బాధపడుతున్న సిబ్బంది: శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో 2,058 మంది పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారందరికీ గుండె సంబంధిత సమస్య అనుమానంతో 2000 మందికి ఈసీజీ తీశారు. అందులో 200 మందిని టీఎంటీ పరీక్షకు పంపారు. కాగా అందరికీ రక్త పరీక్షలు చేశారు. ఇంకా 103 మందికి యాంజియోగ్రామ్ పరీక్ష చేయాల్సి వచ్చింది. అందులో ముగ్గురికి సమస్య తీవ్రంగా ఉండటంతో వెంటనే స్టంట్లు వేశారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులను కలుపుకొని 40 శాతం మందికి బీపీ, డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు. 180 మందికి పైగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు.
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ - రెండు సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ
పలువురికి వైద్యులు కీలక సూచనలు:
- జిల్లా కేంద్రంలోని స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అతన్ని వెంటనే స్టంట్ వేయించుకోవాలని సూచించారు.
- నరసన్నపేట పీఎస్ పరిధిలో ఓ హెడ్ కానిస్టేబుల్‌కు రక్తపోటు ఉందని విధుల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
- సోంపేట పోలీసు స్టేషన్లో ఓ కానిస్టేబుల్‌కు గుండె సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
- కాశీబుగ్గ పీఎస్ పరిధిలో ఓ కానిస్టేబుల్‌కు గుండె సమస్య, మధుమేహం ఉన్నట్లు గుర్తించి స్టంట్ వేయించుకోవాలని సూచించారు.
పోలీసులు నిత్యం విధుల్లో ఉండటంతో అనారోగ్యానికి గురవుతున్నారు. సమయానికి భోజనం, నిద్ర లేకపోవడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. దీన్ని గమనించి వారాంతపు సెలవు అమలు చేస్తున్నాం. సిబ్బందికి ఆరోగ్యం ముఖ్యం అందులోను వారు ఆరోగ్యంగా ఉంటేనే పోలీసు శాఖ ముందుకు వెళ్తుంది. నేర నియంత్రణకు పకడ్బందీగా సేవలందిస్తారు.- కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ
రేపు విశాఖకు ప్రధాని - ప్రత్యేక ఆకర్షణగా మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో
'ట్రయాంగిల్'తో మీ ఇంటి ముంగిటకే సేవలు - త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు