PM Modi Visakha Tour 2025 : విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని చేరుకుంటారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.
ఈ క్రమంలో 4:45 గంటలకు సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 గంటల వరకు సభ జరగనుంది. సభా వేదిక పైనుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు భూమిపూజ చేస్తారు. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్, రూ.1800ల కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
విశాఖ, ఒడిశా పర్యటనలపై ప్రధాని మోదీ తెలుగులో పోస్ట్ చేశారు. హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖ ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమని చెప్పారు. మోదీ పోస్ట్‌కు బదులిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజల తరపున స్వాగతం పలికారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే నేటి కార్యక్రమం రాష్ట్రాభివృద్ధిలో కీలక ముందడుగని అభివర్ణించారు.
PM Modi AP Tour 2025 : ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అటు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. వైఎస్సార్సీపీ హయంలో ఏపీని అన్నివిధాలా నాశనం చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు, పురందేశ్వరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని పాల్గొనే సభకు దాదాపు 2 లక్షల మంది వస్తారని రోడ్ షోలో లక్ష మంది వరకూ పాల్గొంటారనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 3000ల మంది పోలీసులను మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.
కనుమ అంటేనే కోనసీమ - ప్రభల తీర్థంపై ప్రధాని మోదీ లేఖ
విశాఖకు మోదీ రాక - రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందా?!