STEM CELLS PRESERVE : డబ్బులు, నగలు బ్యాంకులు, లాకర్లలో దాచుకోవడం చూశాం. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వ చేసి అవసరం ఉన్న వారికి అందించేలా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయి. కానీ, మూలకణాలు (బొడ్డుతాడు) భద్రపర్చుకుంటున్నారనే సమాచారం ఆశ్చర్యంగానే ఉన్నా సెలబ్రిటీలు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు. అంతేకాదు ఆయా వ్యాపార సంస్థల తరఫున ప్రచారం చేస్తున్నారు.
ప్రాణాలకు తెగిస్తేనే 'డేరియన్ గ్యాప్' దాటేది - అమెరికా అక్రమ వలసల మార్గమిదే!
విశాఖ నగరంలో
విశాఖ నగరంలోని పలు ఏజెన్సీ సంస్థలు బొడ్డుతాడు భద్రత బాధ్యతలు తీసుకుంటున్నాయి. ప్రసవానికి ముందుగానే పేర్లు నమోదు చేయించి కాన్పు జరిగిన ఐదు నిమిషాల్లో బొడ్డుతాడు భద్రపరిచి తరలించే బాధ్యత తీసుకుంటున్నాయి. ఈ సేవకు కొద్దిగా ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ముందు చూపుతో కొందరు నమోదు చేయించుకుంటున్నారు. ఇందుకు భారీగానే ఫీజు ఉంటున్నట్లు సమాచారం.
మూలకణాలపై విస్తృత అవగాహన
వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో బొడ్డుతాడును భద్రపర్చుకోవడం కొత్తేమీ కాదు. సమీప రక్తసంబంధీకులు ఎవరైనా అనారోగ్యం బారిన పడినా భద్రపర్చిన మూలకణాల నుంచి అవసరమైన శరీర భాగాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో స్టెమ్‌సెల్స్ నిల్వ అనేది విస్తృతంగా ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుండగా పలువులు ప్రముఖులు తమ కుటుంబంలో పుట్టే బిడ్డల బొడ్డుతాడును భద్రపర్చడం ప్రారంభించారు. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు కూడా తమ పాప స్టెమ్‌సెల్స్ ని భద్రపరచుకోవడం తెలిసిందే. ప్రముఖ నటీనటులు మూలకణాల బ్యాంకుకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తున్నారు. అందాల నటి ఐశ్వర్యారాయ్, ప్రముఖ నటుడు మహేశ్‌బాబు సైతం బొడ్డుతాడు ప్రాధాన్యతను వివరించి భద్రపర్చుకునేలా సూచనలు చేస్తున్నారు.
అమూల్య కణాల గని!
బొడ్డుతాడులో పుష్కలమైన మూలకణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించిన నేపథ్యంలో స్టెమ్‌సెల్స్ భద్రతపై విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రసవ సమయంలో తల్లి గర్భంలోంచి బిడ్డతో పాటు బొడ్డుతాడు బయటకు వస్తుంది. గతంలో ఇది నిరుపయోగమని భావించి కత్తిరించేసేవారు. కాగా, బొడ్డుతాడును అమూల్య కణాల గనిగా గుర్తించిన శాస్త్రవేత్తలు అధునాతన రీతిలో భద్రపరిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆ దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంతర్గత అవయవాలు (లివర్, కిడ్నీలు) వంటివి దెబ్బతిన్నప్పుడు మూలకణాల ద్వారా తిరిగి అభివృద్ధి చెందించేలా కృషిచేయవచ్చని భావిస్తున్నారు.
తల్లీ, బిడ్డలకు అనుసంధానం
తల్లి కడుపులోని బిడ్డకు బొడ్డు తాడు ద్వారానే ఆక్సిజన్, గ్లూకోజ్ అందుతాయి. ఇందులో ఒక ధమని, ఒక సిర రక్తనాళాలు ఉంటాయి. ధమని నుంచి యూరియా, కార్బన్ డైఆక్సైడ్ తల్లి రక్తనాళాలకు, సిర ద్వారా ఆక్సిజన్, పోషకాలు బిడ్డకు సరఫరా అవుతుంటాయి. బొడ్డుతాడులోని రక్తాన్ని సేకరించిన తర్వాత దాన్ని వీలైనంత వేగంగా ల్యాబొరేటరీలకు తరలిస్తారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులో నిల్వ చేస్తారు. రక్తంలోని ప్లాస్మాని తొలగించి రక్త కణాలన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇందుకోసం పలు సంస్థలు ఒక్కో ధర నిర్ణయిస్తున్నాయి. సమయంపై ఆధారపడి చార్జీలు ఉంటున్నాయి. బొడ్డుతాడు రక్తకణాలను నిల్వ ఉంచడానికి విశాఖలోని ఓ సంస్థ లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
శేషాచలంలో కలివి కోడి - 'ఈ పక్షిని కనిపెట్టిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం!'
దేశంలోనే అతి చిన్న రైలు ఏమిటో తెలుసా? - కేవలం మూడు బోగీలతో ప్రయాణం!