NITI Aayog Fiscal Health Index 2025 : ఏపీ ఆర్థిక ఆరోగ్యం జగన్ పాలనలో ఎంత దారుణంగా ఉందో నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 2022-2023 ఆర్థిక ఏడాదిలో దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తూ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక పేరిట ఓ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. కాగ్, ఆర్‌బీఐతో పాటు వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ద్వారా నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించగా వాటిలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. నాడు పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన స్థానంలో ఉండేవని పేర్కొంది.
శుక్రవారం నీతి ఆయోగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో తొలి రెండు స్థానాలను ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దక్కించుకోగా, చివరి రెండుస్థానాల్లో ఏపీ, పంజాబ్ నిలిచాయి. 2014-2015 నుంచి 2021-2022 మధ్య సగటున 13వ ర్యాంకులో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత 17వ ర్యాంకుకు పడిపోయింది. ఖర్చుల నాణ్యత విషయంలో 15, ఆదాయ సమీకరణ, ఆర్థిక హేతుబద్ధత విషయంలో 16, రుణసూచికలో 12వ ర్యాంకును రాష్ట్రం దక్కించుకొంది.
AP Ranks 17th in NITI Aayog Index : పంజాబ్, ఏపీ, కేరళ, పశ్చిమబెంగాల్ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నట్లు నీతి అయోగ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆ సమయంలో తీవ్ర ఆర్థికలోటుతో సతమతమైందని పేర్కొంది. అప్పులతో పాటు వడ్డీ చెల్లింపులు పెరగడం రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక సమస్యగా మారినట్లు వివరించింది. మొత్తం వ్యయంలో రాష్ట్ర మూలధన వ్యయం 3.5 శాతంకి పరిమితమైందని వెల్లడించింది. 2022-23లో చేసిన అప్పుల్లో 4.4 శాతం మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చుచేసినట్లు వివరించింది.