AP NEW SPORTS POLICY FEATURES : కొత్త క్రీడా విధానం క్రీడాకారులు, సంఘాల్లోనూ కొత్త ఊపిరిలూదింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై పట్టం కట్టనుంది. భారీ నజరానాలతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు క్రీడాకారుల వెన్నంటి ఉండి వారిని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనుంది.
ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు ఏర్పాటు: ఏపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త క్రీడా విధానం ద్వారా ప్రతి గ్రామంలోనూ మైదానం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయనుంది. అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్రీడా నగరం స్థాపించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఏపీని గమ్యస్థానంగా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. కాకినాడ, గుంటూరు, విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో జాతీయస్థాయి అత్యుత్తమ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తేనుంది. అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు ఏర్పాటు చేయనునున్నారు.
క్రీడా రాజధానిగా ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల చేసిన సూచనలపై అధికారులు మార్పులు, చేర్పులు చేసి కొత్త క్రీడా విధానం-2024-29ను సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. క్రీడారంగాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తొలగించి వారిలో నూతనోత్సాహాన్ని నింపేలా కూటమి ప్రభుత్వం రాబోయే ఐదేళ్లకు కొత్త క్రీడా విధానం రూపొందించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి దేశంలోనే ఇప్పటివరకు హరియాణా అత్యధికంగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంది.
క్రీడల్లో మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే అకాడమీలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2029 నాటికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాష్ట్రాన్ని క్రీడా రాజధానిగా, క్రీడల్లో నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలకు ప్రపంచంలోనే ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రీడా విధానంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.