AP Liquor Policy 2024: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం దుకాణాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన 3 రోజుల్లోనే ఏకంగా 3 వేల దరఖాస్తులకు పైగా వచ్చాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తొలిరోజైన మంగళవారం 200 రాగా, గత రెండు రోజుల్లో ఏకంగా 2,800కు పైగా అందాయి. ఫలితంగా ఇప్పటి వరకు రుసుముల రూపంలో సుమారు రూ.60 కోట్లు సమకూరాయి. అయితే, దరఖాస్తులు దాఖలు చేయడానికి ఈ నెల తొమ్మిది వరకు గడువు ఉన్న నేపథ్యంలో.. చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశముంది.
చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు:రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్స్లకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేయడానికి ఈ నెల తొమ్మిది వరకు గడువు ఇచ్చింది. ఇంకా గడువు ఉన్న తరుణంలో మొత్తంగా లక్షకుపైగా దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని భావిస్తున్నారు. గతంలో 2017లో 4,380 మద్యం దుకాణాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, ఒక్కో దానికి సగటున 18 చొప్పున మొత్తంగా 78 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 3,396 దుకాణాలకుగానూ ఒక్కో దానికి సగటున 30 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోవాలి :నూతన మద్యం దుకాణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన సమగ్ర యూజర్ మాన్యువల్‌ను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దరఖాస్తు విధానానికి సంబంధించిన ఉత్తర్వులు, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టారు.
- ఇందుకోసం ముందుగా hpfsproject.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఫోన్ నంబర్‌నే యూజర్ ఐడీగా వినియోగించుకొని, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లేదా ఓటీపీతో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విశాఖలో గరిష్ఠం - అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యల్పం :ఎక్సైజ్ శాఖ నోటిఫై చేసిన 3,396 దుకాణాల్లో 2,261 (66.57 శాతం) మండలాల్లోనే ఏర్పాటుకానున్నాయి. నగరపాలక సంస్థల్లో 511, పురపాలక సంఘాల్లో 499, నగర పంచాయతీల్లో 125 చొప్పున ఏర్పాటు చేయనుంది. ఇందులో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 136, గుంటూరులో 52 చొప్పున ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తిరుపతిలో 227, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 40 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.