ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిక్కిరిసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు - రెండు రోజుల్లో భారీగా ఆదాయం - REGISTRATION CHARGES HIKE

శనివారం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ విలువలు పెంపు - ఈలోపే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు క్యూ కట్టిన ప్రజలు

Rush in Registration Offices
Rush in Registration Offices (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 8:54 PM IST

AP Land Registration Charges Hike: శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెరుగుతుండటంతో కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. ఛార్జీలు పెరిగేలోపే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కొన్నిచోట్ల సర్వర్ల మొరాయింపుతో ప్రక్రియ ఆలస్యంగా సాగగా, మరికొన్నిచోట్ల సజావుగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నమోదు అయింది.

సాధారణ రోజుల కంటే రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిట లాడాయి. గురువారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఒక్కరోజులోనే ప్రభుత్వానికి రూ.107 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. శుక్రవారం కూడా అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు స్పష్టమవుతోంది.

గడచిన రెండు రోజులుగా రోజువారీ సగటు కంటే రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. జనవరి 29 తేదీన అమావాస్య రోజున కూడా దాదాపు 8 వేల వరకూ డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో పని దినాల్లో సగటున 7 వేల నుంచి 8 వేల వరకూ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం నమోదు అవుతుంటాయి. రూ.25-30 కోట్ల వరకూ ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు వస్తుంది.

అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు - రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర రద్దీ

రెండు రోజుల్లో 14 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు:అయితేఫిబ్రవరి 1 తేదీ నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల విలువల సవరణకు సంబంధించి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సర్క్యులర్ జారీ చేయటంతో హడావుడిగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. గడచిన రెండు రోజులుగా 14 వేల పైచిలుకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినట్టు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అల్లూరి జిల్లాలో మాత్రం ఎక్కడా రిజిస్ట్రేషన్లు నమోదు కాలేదు.

ఆదాయపరంగా ఎన్టీఆర్ జిల్లాలో రూ.13.8 కోట్లు, గుంటూరులో రూ.13.6 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.13 కోట్ల మేర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన ఈ రిజిస్ట్రేషన్ల పెంపుదల ఉండే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా విలువలను పెంచేయటంతో, అన్ని చోట్లా హేతుబద్దత లేకుండా ధరలు పెరిగిపోయాయి. అయితే వీటిని హేతుబద్దంగా సవరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

గ్రోత్ కారిడార్​లలో విలువలను పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం, కొన్ని చోట్ల పెరిగిన ధరల్ని సవరిస్తామని స్పష్టం చేస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లాంటి పట్టణ ప్రాంతాల్లో 6 శాతం వరకూ విలువల పెంపు నమోదు అయ్యే అవకాశం ఉంది. అమరావతి రాజధాని గ్రామాల పరిధిలో పెంపుదల ఉండబోదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 1 నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి అనగాని

రిజిస్ట్రేషన్‌ ఆఫీసులకి జనం క్యూ:మరోవైపు శుక్రవారం విజయవాడలోని పలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్రయవిక్రయదారులు తరలివచ్చారు. సర్వర్‌ మొరాయింపు వల్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దూరం నుంచి వచ్చిన తాము తమ వంతు కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపారు. విశాఖ మధురవాడలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉదయం నుంచే ప్రజలు క్యూకట్టారు. తమ వంతు కోసం చాలా సేపు నిరీక్షించారు. సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో ప్రక్రియ ఆలస్యంగా సాగింది. క్రయవిక్రయాల కోసం వచ్చినవారు కాస్త ఇబ్బంది పడ్డారు.

గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణ రోజులతో పోలిస్తే జనం ఎక్కువగా తరలివచ్చి ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సగటున ప్రతి కార్యాలయం పరిధిలో సాధారణ రోజుల కన్నా 10 నుంచి 50 డాక్యుమెంట్ల వరకు అదనంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా వేసిన షెడ్లో వారు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనంతో నిండిపోయాయి. గురువారం సర్వర్ మొరాయించినా శుక్రవారం బాగా పనిచేసిందని జిల్లా రిజిస్ట్రార్ చెన్నకేశవరెడ్డి తెలిపారు.

అక్కడ వాహనం కొని ఇక్కడ రిజిస్ట్రేషన్​ - ఇకపై ఏపీలో అలా కుదరదు

ABOUT THE AUTHOR

...view details