Swiggy Boycott in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఆహార సరఫరా ఆర్డర్లను బహిష్కరిస్తున్నట్లు హోటల్ యజమానుల సంఘం ప్రకటించింది. ఈమేరకు విజయవాడలో ఏపీ హోటల్ అసోయేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అసోయేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామి, విజయవాడ అసోయేషన్ అధ్యక్షులు రమణరావు నేతృత్వంలో అన్ని జిల్లాల అసోయేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా స్విగ్గి, జుమాటో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సంస్థలతో చర్చించామని తెలిపారు.
తమకు ఇవ్వాల్సిన కమిషన్ విషయంలో ఈ సంస్థలు అనేక నిబంధనలు విధిస్తున్నారని, వీటివల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. తమకు తెలియకుండానే కాంబో ప్యాకేజీల పేరిట ఆర్డర్లు బుక్ చేస్తున్నారని వాటి అయ్యే ఖర్చులు, పన్నులను సైతం తమపైనే వేస్తున్నారని అన్నారు. జొమాటో సంస్థ కొంత వరకు తమ అభ్యంతరాల పరిష్కారానికి ఆససక్తి చూపిందని కానీ స్విగ్గీ సంస్థ వాయిదా వేస్తూ కాలయాపన చేయడం వల్ల అనివార్య పరిస్థితుల్లో బాయ్‌కాట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోయేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈనెల 14 నుంచి స్విగ్గీ సేవలు బంద్ :అలానే క్యాష్ పేమెంట్స్ చేయకుండా ఇబ్బందిపెడుతున్నట్లు స్విగ్గీపై హోటల్, రెస్టారంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆన్‌లైన్ ఆహార సరఫరా సంస్థలతో వ్యాపారం కొనసాగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని కానీ వారు అనుసరిస్తోన్న నియమ నిబంధనల్లో తగిన మార్పులు చేసేందుకు సమ్మతిస్తే అప్పుడు తమ నిర్ణయాన్ని పునరాలోచన చేస్తామన్నారు. ఈనెల 14 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో స్విగ్గీ ఆర్డర్లు తీసుకోబోమని ప్రకటించారు.