Two Children Died From Rat Poison Exposure : ఎలుకల మందు పీల్చడం వల్ల ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కుంద్రత్తూర్లో జరిగింది. వారి తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురై, మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు సేకరించారు. చిన్నారుల మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏం జరిగిందంటే?
గిరిధరన్(36), పవిత్ర(31) కుద్రత్తూర్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వైష్ణవి(6), సాయి సుదర్శన్(1) ఉన్నారు. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ అవడం వల్ల- ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఒక ప్రైవేటు పెస్ట్ కంట్రోల్ కంపెనీకి అప్పగించారు. అయితే ఎలుకలను తరమికొట్టడానికి మోతాదు కంటే ఎక్కువగా కెమికల్స్ వాడారు. కెమికల్ ఇల్లంతా వ్యాపించింది. దాన్ని పీల్చిన చిన్నారులు ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం గిరిధరన్, పవిత్ర ప్రాణాలతో పోరాడుతున్నారు. ఘటనాస్థలిని సందర్శించిన తాంబరం ఫోరెన్సిక్ సైన్స్ ఇన్స్టిట్యూట్ నిపుణులు, ప్రైవేటు కంపెనీ ఉపయోగించిన పెస్టిసైడ్స్ శాంపిళ్లను సేకరించారు.
ఈ ఘటనకు సంబంధించి పెస్ట్ కంట్రోల్ కంపెనీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంట్లో కెమికల్స్ ఉపయోగించిన దినకరన్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.