AP Govt Used Drones To Deliver Food In Flood Affected Vijayawada : విజయవాడ వరదల సమయంలో డ్రోన్ సేవలను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుందని, ఇది అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమని వక్తలు కొనియాడారు. హెలికాప్టర్లు, పడవల ద్వారా వెళ్లలేని మారుమూల ప్రాంతానికీ డ్రోన్ ద్వారా ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేశారని కొంత మంది ప్రముఖులు వ్యాఖ్యానించారు.
ఆకాశంలో అద్భుతం - అమరావతిలో డ్రోన్‌షో అదుర్స్
విపత్తు నిర్వహణకు డ్రోన్లు :డ్రోన్ సమిట్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం ( అక్టోబర్ 22న) ‘మెరుగైన ప్రజాభద్రత, సమర్థంగా విపత్తు నిర్వహణకు డ్రోన్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో పలువురు నిపుణులు పాల్గొన్నారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్ల ద్వారా సేవలందించామని మారుత్ డ్రోన్స్ సీఈఓ ప్రేమ్‌కుమార్ వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగించడం ఏపీ నుంచే మొదలైందని పేర్కొన్నారు. విపత్తులు వచ్చినప్పుడు మొబైల్ సిగ్నల్ (Mobile signal) లేని ప్రాంతాల్లోనూ డ్రోన్ ద్వారా సేవలు అందించే వీలుంటుందని సమన్వయకర్తగా వ్యవహరించిన సుధీర్ వర్మ పేర్కొన్నారు. వరదల సమయంలో మునిగిన పొలాల ఫొటోలు తీసి, వాటి ఆధారంగా పరిహారం అంచనా వేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయని మనోజ్ వివరించారు.