AP Waiting IPS Officers Issue :ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊడిగం చేస్తూ, ప్రతిపక్షాలపై అరాచకాలకు తెగబడిన కొందరు ఐపీఎస్ అధికారులు కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కబెట్టినా పద్ధతి మార్చుకోలేదు. వైఎస్సార్సీపీ హయాంలో సాగిన అక్రమాలు, అరాచకాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించినా కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు కుట్ర చేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం గుర్తించింది.
కేసుల విచారణ చేస్తున్న అధికారులు, సిబ్బందిని పిలిపించుకుని మాట్లాడుతున్నారని నిఘా విభాగానికి నిర్ధారణకు వచ్చింది. విచారణను తప్పుదోవ పట్టించేలా అధికారులను ప్రభావితం చేస్తున్నట్లు డీజీపీ కార్యాలయానికి నివేదించింది. వివిధ కేసుల్లో తమ పాత్రను, వైఎస్సార్సీపీ పెద్దల వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించేలా ఒత్తిడి చేస్తున్నారని అంచనాకు వచ్చారు. కొన్ని కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు తేల్చారు. ఈ అంశాలన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా విభాగం నివేదిక ఇచ్చింది.
ఈ విషయాలు తెలుసుకుని ప్రభుత్వ పెద్దలు షాక్ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్నా ఇప్పటికీ వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను సహించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెయిటింగ్‌లో ఐపీఎస్‌ల కుట్రలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన డీజీపీ కార్యాలయం విరుగుడు చర్యలు చేపట్టింది. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలని, సాయంత్రం వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది.
కలవడానికి వస్తే అవమానిస్తారా - ఓడినా బుద్ధి మారలేదు : జగనన్నపై కార్యకర్తలు ఆగ్రహం - Clash at YS Jagan House
AP DGP Memos To Waiting IPS Officers : కాగా ఆంధ్రప్రదేశ్‌లో వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమోలు జారీ చేశారు. ప్రతి రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేని వారికి మెమోలు జారీ చేశారు. పీఎస్సార్ ఆంజనేయులు, సునీల్ కుమార్ సహా 16 మంది అధికారులకు మెమోలు జారీ చేశారు. సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్నీ, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజులకు మెమోలు జారీ చేశారు. అదే విధంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. రోజూ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.