తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్​ సుద్దపూస కాదు - నేను ముమ్మాటికీ సనాతన హిందువునే : పవన్ - Pawan Kalyan On Sanatana Dharama - PAWAN KALYAN ON SANATANA DHARAMA

నా ప్రాణాలు ఒడ్డయినా సనాతన ధర్మాన్ని కాపాడతా జగన్‌ అమాయకుడు, సుద్దపూసేమీ కాదు - ఆయనపై 29 కేసులున్నాయి కల్తీ నెయ్యే కాదు.. తిరుమలలో అంతకు మించిన ఘోరాలు : పవన్​ కల్యాణ్

AP Dy CM Pawan Kalyan On Sanatana Dharma
AP Dy CM Pawan Kalyan On Sanatana Dharma (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 12:03 PM IST

AP Dy CM Pawan Kalyan On Sanatana Dharma :వైఎస్సార్​సీపీ అధ్యక్షుడు జగన్‌ అమాయకుడు, సుద్దపూసేమీ కాదని, ఆయనపై మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై 29 కేసులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఐదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని ఐదేళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని, అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. వాటన్నింటిని ఉన్నత న్యాయవ్యవస్థ, జాతి దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ఆ విషయం చిన్న ఘటనలా తీసేయకూడదు :తీర్పు ఇచ్చే ముందు ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారుచేయడాన్ని చిన్న ఘటనలా తీసేయకూడదని, వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలకమండళ్ల హయాంలో అంతకు మించిన ఘోరాలు అనేకం చోటుచేసుకున్నాయని పవన్‌ పేర్కొన్నారు.

సనాతన ధర్మాన్ని ముట్టుకున్న వారు ఎవరైనా మాడి మసైపోతారని పవన్​ కల్యాణ్ హెచ్చరించారు. గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్‌ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని ఆరాధిద్దాం- ఇతర మతాలను గౌరవిద్దాం' అని ప్రతిజ్ఞ చేయించారు.

"జగన్‌ తన చేత్తో లడ్డూలు చేశారని, అపవిత్రం చేశారని గానీ నేను ఎక్కడా చెప్పలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే వారే భుజాలను తడుముకుంటున్నారు. తప్పు జరిగిందని, విచారణ చేయమని అడుగుతుంటే, రాజకీయం చేస్తున్నామని విమర్శిస్తున్నారు. ఆ అవసరం మాకేముంది?"- పవన్​ కల్యాణ్, ఏపీ ఉపముఖ్యమంత్రి

నాకు సనాతన ధర్మం ముఖ్యం : 'తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను కోర్టును, న్యాయవ్యవస్థను ఎంతో గౌరవిస్తాను. కానీ జాతి దృష్టికి కొన్ని విషయాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా పరిమితులేంటో నాకు తెలుసు. కానీ తిరుమలలో కొన్ని సరిగా జరగలేదు. ఆ విషయాలను మీ దృష్టికి తెస్తున్నా. నాకు సనాతన ధర్మం, ప్రజాస్వామ్య విలువలు ముఖ్యం. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో తెలుసుకోండి' అని పవన్​ విజ్ఞప్తి చేశారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలు జరిగాయి :'శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడం ఒక్కటే కాదని, తిరుమల పవిత్రతను దెబ్బతీసే అనేక చర్యలు గత 5 ఏళ్లలో తరచూ జరిగాయి. మీరు ఏదైనా తీర్పు చెప్పాలనుకుంటే నా వాదన ఇదే’ అని పవన్​ కల్యాణ్ పేర్కొన్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్నే తిట్టించేంత వ్యక్తి జగన్‌ అని ధ్వజమెత్తారు.

జగన్​ తన సోషల్​ మీడియా బృందంతో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైనే తప్పుడు పోస్టింగులు పెట్టించారని అని పవన్​ గుర్తు చేశారు. ‘నెయ్యి కల్తీ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాలో మాట్లాడలేదన్నారు. ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరైన ఎన్డీయే సమావేశంలో వాస్తవాలను వివరించారని​ తెలిపారు. ఏం జరుగుతుందో చెప్పారన్నారు. ఆయన ఎవర్నీ నిందించలేదని అని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

రూ.10,500 వసూలు చేసి రూ.500 రసీదు :వైవీ సుబ్బారెడ్డి టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా ఉండగా శ్రీవాణి ట్రస్ట్‌ పేరుతో ఒక్కో టికెట్‌కు రూ.10,500 వసూలు చేసి, రూ.500కి మాత్రమే రసీదు ఇచ్చేవారని పవన్​ కల్యాణ్ ఆక్షేపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడం బయటకు కనిపించే చిన్న అంశమే. వారి హయాంలో ఇలా రూ.కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి అని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

‘మేం చచ్చిపోతాం, హారతులు వెలిగించుకుంటామంటూ వైఎస్సార్​సీపీ నాయకులు డ్రామాలు చేయొద్దు. భవిష్యత్తులో మీకు ఒకటే శిక్ష ఉంటుంది. అది ఆయనే (భగవంతుడే) చెబుతాడు. నిజరూప దర్శనం జరిగినప్పుడు తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. తాను ఈఓగా బాధ్యతలు స్వీకరించాక నెయ్యిలో కల్తీ జరగలేదని మాత్రమే శ్యామలరావు చెప్పారని పవన్​ వివరించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు, ఎక్కడికి మాయమైపోయారని ఆయన ప్రశ్నించారు.

Pawan Fires On Congress Rahul Gandhi :‘సనాతన ధర్మమనేది ఒక వైరస్‌ అని దాన్ని అంతం చేస్తామని ఇటీవల ఒక యువ నాయకుడన్నారు. శ్రీరాముడి విగ్రహాన్ని కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. మొన్నీ మధ్య రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ తల నరికేశారు. జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యితో చేసిన ప్రసాదాల్ని ఏడుకొండల శ్రీనివాసునికి నైవేద్యంగా పెట్టారు. అదే కల్తీ నెయ్యితో చేసిన లక్ష లడ్డూల్ని అయోధ్య రాములవారికి పంపించారు. ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘నాచ్‌ గానా’ సభగా ఎద్దేవా చేశారు. వాళ్లు సనాతన ధర్మాన్ని అవహేళనప్పటికీ మా మనోభావాలు దెబ్బతినకూడదు. హిందువులంతా ఓట్లేసి వాళ్లను గెలిపించాలి. కానీ వాళ్లు మాత్రం రాముడిని గౌరవించరు’ అని పవన్​ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రామున్ని విమర్శించే సాహాసం చేయొద్దు:మమ్మల్ని ద్వేషించండి. కానీ రాముణ్ని విమర్శించే సాహసం చేయొద్దని పవన్​ కల్యాణ్ హెచ్చరించారు. వైఎస్సార్​సీపీ అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌లపై ఆయన నిప్పులు చెరిగారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అందరూ తన మాటలు వినాలంటూ ఆయన తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మాట్లాడారు. ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భంలో తమిళంలోనూ పవన్ మాట్లాడారు.

లౌకిక వాదం వన్​వే కాదు టు వే :‘సనాతన ధర్మంపై దాడులు నిత్యకృత్యనప్పుడు మేం నోరు మెదపకుండా, శాంతి వచనాలు ఎలా పలుకుతాం? ఒక అల్లా గురించో, మహమ్మద్​ ప్రవక్త గురించో తప్పుగా మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు. ప్రపంచమంతా గగ్గోలు పెట్టేస్తారు. కానీ మేం సనాతన ధర్మంపై స్పందిస్తే మాత్రం మతోన్మాదులం అయిపోతాం. మా బాధ చెప్పుకొనడం పాపమా? లౌకికవాదం వన్‌వే కాదు టు వే. మాకు మీరు మర్యాదివ్వండి మర్యాద తీసుకోండి. అలా జరగనప్పుడు గొంతెత్తక తప్పదు’ అని పవన్ స్పష్టం చేశారు.

‘వేంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్‌ అంటూ కోట్ల మంది భక్తిశ్రద్ధలతో కొలుచుకునే తిరుమలేశునికి ప్రసాదంలో అపచారం జరిగినందుకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే రాజకీయం చేయొద్దంటూ అవహేళన చేశారు. సనాతన ధర్మాన్ని పాటించడమే మహాపాపం అన్నట్టుగా కొందరు సూడో మేధావులు గగ్గోలు పెట్టారు. వైఎస్సార్​సీపీ నాయకులు సనాతన ధర్మాన్ని ప్రతి రోజూ అవమానిస్తున్నా భరించాం. కానీ తిరుమల శ్రీవారికి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాలు పెడితే భరించలేం. అపచారం జరుగుతోందని, సరిదిద్దుకోమని చెప్పి గతంలో ఇక్కడ జరిగిన సభలోనే హెచ్చరించాను. అయినా వినలేదు. ప్రజలు వారిని 11 సీట్లకు కుదించినా ఇంకా బుద్ధి రాలేదు’ అని ఆయన విరుచుకుపడ్డారు.

Pawan Kalyan On Sanatana Dharma :‘ఈ దేశంలోని చట్టాలు కూడా సనాతన ధర్మాన్ని పాటించేవారి విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అన్యధర్మాలు పాటించేవారిపై ఎక్కువ మానవత్వం, దయను చూపిస్తాయి. సనాతన ధర్మాన్ని దూషించేవారికే కోర్టులు రక్షణ కల్పిస్తాయి. ఈ దేశంలో మెజారిటీ వర్గంగా ఉండటం బలహీనత కూడా కావొచ్చు’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

అందరం ఏకం కావాల్సిన సమయం వచ్చింది! : 18వ శతాబ్దంలో లార్ట్​ మెకాలే ప్రవేశపెట్టిన సాంస్కృతిక సామ్రాజ్యవాదం సనాతన ధర్మంపై దాడి చేసేవారిలో ఇంకా వేళ్లూనుకునే ఉందని పవన్‌ కల్యాణ్‌ ఆక్షేపించారు. అలాంటి కుహనా లౌకికవాదులకు ‘ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌ గాడ్‌ సేవ్‌ ద కింగ్‌ సో హెల్ప్‌ మీగాడ్‌’ అని రాసే పాశ్చాత్య అగ్ర రాజ్యాలు కనిపించవన్నారు. ఆసియా, ఆఫ్రికాల్లో ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్న దేశాలు కనిపించవని తెలిపారు.

బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో 3,630 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పవన్​ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దేశాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా ప్రకటించుకున్నా, అక్కడి హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదని ఆంక్షలు విధించినా సూడో మేధావులకు అది కనిపించదు’ అని ధ్వజమెత్తారు.

హిందూ ఐనైక్యత, కులాలు, సాంస్కృతిక, ప్రాంతీయ భేదాలు, పిరికితనాన్ని మంచితనం అనుకోవడం, చేతగానితనానికి అసహనం అని పేరు పెట్టుకోవడం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలైపోయాయని పవన్​ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు, కృష్ణుడు, కాళికాదేవి నల్లని మేని ఛాయ కలిగి ఉంటారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు. వాటన్నింటికీ అది అతీతం. మనం భయం, పిరికితనం వదిలేసి ఏకం కావాల్సిన సమయం వచ్చింది’ అని దిశానిర్దేశం చేశారు.

అందుకే నా కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించా :‘నేనెప్పుడూ ధర్మాన్ని తప్పలేదు. ఇలాంటి సభలు జరిగేటప్పుడు నమాజ్‌ వినిపిస్తే ప్రసంగం ఆపేసి గౌరవం ప్రకటించేవాడిని. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు నా కూతురితో డిక్లరేషన్‌ ఇప్పించాను. నన్ను విమర్శించే వాళ్లకి ఒకటే చెబుతున్నా. ఏ రస్తా (దారి) అయితే యుద్ధాలు చేస్తుందో ఓడినా, గెలిచినా ముందుకు పోతుందో అదే నా రస్తా కూడా. ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్‌ చేస్తాయో, అపజయం కూడా అగ్నిజ్వాలల్లా మండుతుందో, మరణం కూడా మహా ప్రభంజనంలా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. అందుకే పరాభవం చెందినా, పరాజయాలు పొందినా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే సనాతన ధర్మంపై నాకున్న అచంచల విశ్వాసమే అందుకు కారణం’ అని ఆయన పేర్కొన్నారు.

సనాతన ధర్మంపై దాడి జరిగితే మౌనంగా ఊరుకోవాలా? : పవన్‌ - Pawan Kalyan On Sanatan Dharma

పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ - శ్రీవారి ఆలయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ - Pawan Kalyan Tirumala Tour

ABOUT THE AUTHOR

...view details