AP Deputy CM Pawan Kalyan On Sanatan Dharma : ఏడు కొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగించారు. తనకు అన్యాయం జరిగినా బయటకు రాలేదు కానీ సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోడానికి వచ్చానని పవన్ తెలిపారు. నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందనుకోలేదన్నారు. తిరుమలలో అపచారం జరుగుతోంది సరిదిద్దండి అని గతంలో తెలిపానన్నారు. సనాతన హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వట్లేదని ఇతర మతాలను గౌరవించేదే సనాతన ధర్మం అని పవన్ అన్నారు.
కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వరస్వామి అని తాను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడారని పవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేళన చేశారని సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మధ్య దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని దాడులు జరుగుతుంటే మనం పళ్లబిగువున బాధను భరించాలా అని ప్రశ్నించారు.
హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమని హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారన్నారు. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. హిందూమతం గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. రాముడిని తిడితే నోరెత్తకూడదని మనది లౌకికవాద దేశం అంటారన్నారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా అని ప్రశ్నించారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని పవన్ ప్రశ్నించారు.