Pawan kalyan Prayaschitta Deeksha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇవాళ గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్షను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనం పొందారు. 11 రోజులపాటు దీక్షను కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు.
Tirupati Laddu Issue Updates :తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్సార్సీపీ చాలా మార్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి పూజా విధానాలను మార్చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
"శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10,000లు వసూలు చేశారు. కానీ బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయి. రథాలు తగలబెట్టారు ఆలయాలను అపవిత్రం చేశారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాటం చేశాం. ఏ మతమైనా కావచ్చు మనోభావాలు దెబ్బతినకూడదు." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి