CM Revanth Inaugurated Aramghar-Zoo Park Flyover : రీజనల్ రింగ్ రోడ్డు పనులు పూర్తైతే తెలంగాణ దిల్లీ, గురుగ్రామ్‌లను మించి అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 6 వరుసల్లో నిర్మించిన పైవంతెనను సీఎం ప్రారంభించారు. సుమారు 800 కోట్ల వ్యయంతో 4 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ పైవంతెన పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదిగా నిలిచింది. దీనికి మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఆరాంఘర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం : హైదరాబాద్‌లో మరో భారీ పైవంతెన అందుబాటులోకి వచ్చింది. పాతబస్తీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 6 వరుసల్లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, నగర మేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో 11.5 కిలోమీటర్ల మేర అతిపెద్ద పైవంతెన నిర్మాణం జరిగిందన్న సీఎం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండో అతిపొడవైన పైవంతెన అందుబాటులోకి వచ్చిందని స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణ, మెట్రో నిర్మాణం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాల్సి ఉందన్న రేవంత్‌రెడ్డి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు.
"వైఎస్‌ఆర్ హయాంలో అతిపెద్ద పైవంతెన నిర్మాణం జరిగింది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండో అతిపొడవైన పైవంతెన నిర్మించాం. హైదరాబాద్ నగర అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి. రోడ్ల విస్తరణ, మెట్రో నిర్మాణం, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాల్సి ఉంది. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఓల్డ్‌సిటీ కాదు ఒరిజినల్ సిటీ : హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికతో ముందుకెళ్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు. మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. పాతబస్తీ ఓల్డ్‌సిటీ కాదు ఒరిజినల్ సిటీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఈనెల 11 లేదా 12 తేదీల్లో ఎంఐఎం నేతలను సచివాలయానికి ఆహ్వానించి నగర అభివృద్ధిపై చర్చిస్తామని తెలిపారు. మీరాలం ట్యాంకుపై కేబుల్ వంతెన నిర్మాణం, చార్మినార్‌లో కాలినడక బాటలకు నిధులు విడుదల చేస్తామని సీఎం వెల్లడించారు.
జూపార్క్ నుంచి ఆరాంఘర్‌కు 20 నిమిషాల్లో : జూపార్కు-ఆరాంఘర్ ఫ్లైఓవర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే ప్రారంభించాల్సి ఉండగా సర్వీసు రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఆలస్యం వల్ల వాయిదా పడింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని అవసరమైన నిధులు మంజురు చేయడంతో పనులు పూర్తయ్యాయి. 799కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ పాతబస్తీ నుంచి బెంగళూరు జాతీయ రహదారి, శంషాబాద్ విమానాశ్రయానికి సులువుగా వెళ్లేందుకు ఉపయోగపడనుంది. గతంలో ఈ ప్రాంతంలో జూపార్క్ నుంచి ఆరాంఘర్ వెళ్లేందుకు గంట నుంచి గంటన్నర పట్టగా ఇప్పుడు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
కొత్త ఫ్లైఓవర్‌కు డా. మన్మోహన్ సింగ్ పేరు : మాజీ ప్రధాని పీపీ నరసింహారావు, పూర్వ ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని దివాళా తీయకుండా రక్షించారని సీఎం తెలిపారు. ఇప్పటికే పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ ఉన్న నేపథ్యంలో కొత్త పైవంతెనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.
ఇకపై 20 నిమిషాల్లోనే జూపార్క్ నుంచి ఆరాంఘర్ - అందుబాటులోకి నగరంలోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్