AP Deputy CM Pawan Donated One Crore Rupees to CM Revanth : సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించారు.
వరద బాధితులకు ప్రముఖులు విరాళాలు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిందే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మంలోని మున్నేరు వాగు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మున్నేరు వాగు ప్రవాహానికి మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలు అన్ని నీట మునిగాయి. ఇక్కడ ఒకానొక సమయంలో వరద ఉద్ధృతి 36 అడుగుల వరకు ప్రవహించింది. దీంతో బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. తరలించడానికి వీలులేని వారు ఇంటి పై కప్పులపై ఉంటూ సహాయం కోసం ఎదురు చూశారు.
మున్నేరు వరద దాటికి తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత ఎటు చూసిన హృదయవిదాకరమైన సన్నివేశాలే కనిపించాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఇలా అందరూ వారికి తోచిన విరాళాలను సీఎం సహాయక నిధికి అందించారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణకు వరదలకు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు.