AP CM Chandrababu Naidu at NTR Bhavan In Hyderabad : రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం శనివారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు నాయుడు శనివారం చర్చలను ముగించారు. ఆదివారం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అందుకోసం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65 నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లారు.
ఆయన ఇంటి నుంచే కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. టపాసులు, డప్పు చప్పుళ్లతో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు దారిపొడవునా ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాలతో మహిళలు సాదర స్వాగతం పలికారు. తెలంగాణ టీడీపీ పార్టీ శ్రేణుల ఉత్సాహం తనను మంత్రముగ్ధులను చేసిందని చంద్రబాబు అన్నారు.
Chandrababu Speech AT NTR Bhavan :ఇక రాష్ట్రాల అభివృద్ధి గురించి చర్చిస్తూ హైదరాబాద్‌కు తాను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైటెక్‌సిటీ, ఐటీ సెక్టార్‌కు సంబంధించి పాతికేళ్ల క్రితం వేసిన ముందడుగులే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశాయన్నారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్‌గా ఎదిగాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తలసరి ఆదాయం 35 శాతం వ్యత్యాసం ఉండేదని దానిని అయిదేళ్ల పాటు కష్టపడి తగ్గించానని గుర్తుచేశారు. గడిచిన అయిదేళ్లు భూతం పాలించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలు, పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా కూడా తన లక్ష్యం ఒకటే తెలుగు జాతి అభివృద్ధి, దేశంలో తెలుగు రాష్ట్రాల మొదటి స్థానంలో ఉండడమే అని అన్నారు. ఆ మేరకే చర్చలు జరిపినట్లు, తెలంగాణ, ఆంధ్ర ప్రజల మనోభావాల మేరకే రేవంత్‌తో కలిసి ముందడుగు వేస్తామని తెలిపారు.
"తెలంగాణలో మేం నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాను. నా చొరవను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు. తెలుగురాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. తెలుగురాష్ట్రాల అభివృద్ధే తెలుగుదేశం ధ్యేయం. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువ." - చంద్రబాబు, ఏపీ సీఎం