AP CM Chandrababu Comments on Amaravati Capital :రాష్ట్రంలో విధ్వంసం పోయి, నిర్మాణం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయునిపాలెం వద్ద సీఆర్డీఏ భవన ప్రాంగణంలో పూజా కార్యక్రమం నిర్వహించి పనులకు తిరిగి మొదలుపెట్టి ప్రగతికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 2017లో ప్రభుత్వం రూ.160 కోట్లతో 7 అంతస్తుల్లో సీఆర్డీఏ కార్యాలయ పనులను చేపట్టిందన్నారు. మొత్తం 3.62 ఎకరాల్లో 2 లక్షల 42 వేల 481 చదరవు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయనుందని తెలిపారు. ఇప్పటివరకు రూ.61.48 కోట్లను భవన నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. మిగిలిన పనుల పూర్తికి రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 121వ రోజు మళ్లీ ఇక్కడికి వచ్చి భవనాన్ని ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
రామోజీరావును గుర్తు చేసుకున్న బాబు : అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని వైఎస్సార్సీపీ విష ప్రచారం చేసిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అని అంతా గ్రహించాలన్నారు. దేవతల రాజధాని అమరావతి పేరు రాజధానికి తొలుత సిఫార్సు చేసింది రామోజీరావునని ఆయన గుర్తు చేశారు. దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు, హోటళ్లు, ఆసుపత్రులు అన్నీ ఇక అమరావతికే వస్తాయని స్పష్టం చేశారు.
"ఈరోజు ప్రారంభించిన పనులన్నీ రూ.42,519 కోట్లతో ఆ రోజు టెండర్లు పిలిచాం. పనులన్నీ నిలిచిపోయాయి కావున దగ్గరదగ్గర రూ.7 వేల కోట్లు అదనంగా భారం పడే అవకాశం ఉంది. రూ.52 వేల కోట్లు అవుతాయి. ఇప్పటికీ రూ.160 కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు అవుతాయని వైఎస్సార్సీపీ విష ప్రచారం చేస్తోంది. అమరావతి ముంపు ప్రాంతం అని జగన్ ప్రచారం చేస్తున్నారు."- చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి