తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక తెలుగు మీడియంలోనే 'పది' పరీక్షలు రాయొచ్చు - TENTH CLASS EXAMS IN TELUGU MEDIUM

తెలుగులోనూ పరీక్షలు రాసుకునేలా అవకాశమిచ్చిన ఏపీ ప్రభుత్వం - ఆంగ్లంలో ఇబ్బంది పడే విద్యార్థులకు దక్కిన ఊరట - ప్రధానోపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం

ANDHRA PRADESH STATE STUDENTS
TENTH CLASS EXAMS IN TELUGU LANGUAGE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 3:32 PM IST

SSC Exams in Telugu Medium : పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని బట్టి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి అవకాశం కల్పించింది. పబ్లిక్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తులు సమర్పించడం పూర్తయిన వారు కావాలంటే నచ్చిన మాధ్యమానికి మార్చుకునే ఐచ్ఛికాన్ని కూడా అందుబాటులో ఉంచింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతుల విద్యార్థులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం 2020-21లో ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టులో కేసు​ దాఖలైనందున ఇంగ్లీష్‌ మీడియం అని వాడకుండా ఒకే మీడియం అని ఉండాలని ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమమే అన్నట్లు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ, పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు.

ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ వారి తరఫున ప్రధానోపాధ్యాయులు కోరడంతో టీడీపీ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదీకి అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది.

రికార్డుల్లోనే ఆంగ్ల మాధ్యమం, స్కూళ్లలో మాత్రం! :రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి చదువుతున్న వారు దాదాపుగా 6 లక్షల 20 వేల మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ నామినల్‌ రోల్స్‌లో 4 లక్షల 94 వేల మంది విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39 వేల పైచిలుకు విద్యార్థులు తెలుగు మీడియంలోనే పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. గత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్​ మీడియం అమలవుతున్నట్లు రికార్డుల్లో నమోదు చేసింది. క్షేత్రస్థాయిలో తరగతులు, ఉపాధ్యాయుల బోధనను పట్టించుకోకుండా ఒకే మాధ్యమం అంటూ పేర్కొనడం వల్ల తీవ్ర విమర్శలు వచ్చాయి.

విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందున చాలాచోట్ల తెలుగులోనే పాఠాలు చెప్పగా విద్యార్థులు కూడా మాతృభాషలోనే చదువుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో విద్యార్థులు ఏ మాధ్యమంలో రాసినా మార్కులు ఇచ్చేశారు. ఒకేసారి తెలుగు మాధ్యమం నుంచి ఇంగ్లిష్​ మీడియంలోకి మార్పు చేయడంతో వీరి చదువులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ బ్యాచ్‌ విద్యార్థులు పదో తరగతికి రావడంతో ఆంగ్లంలో చదివి, ఇంగ్లీష్​ భాషలో పరీక్షలు రాయాలంటే దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

పదో తరగతి పరీక్షలపై సర్కారు కీలక నిర్ణయం.. ఈసారీ 6 పేపర్లతోనే..

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details