AP Govt Serious on Obscene Posts :సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టారాజ్యంగా తీవ్ర వ్యాఖ్యలను పోస్టు చేస్తున్న వారిపై కమిషనరేట్ పరిధిలో ఇప్పటికి 47 కేసులు పెట్టారు. అలాగే ఇన్ఫర్మేషన్ చట్టం, బీఎన్‌ఎస్( భారత న్యాయ సంహిత) చట్టాల్లోని కఠినమైన సెక్షన్లను జోడిస్తున్నారు. ఈ విధంగా అరాచకవాదుల ఆట కట్టించే వీలుందని పోలీసులు భావిస్తున్నారు.
ఠాణాకు పిలిపించి విచారణ : కమిషనరేట్ పరిధిలోని 23 ఠాణాల్లో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే వారికి నోటీసులు జారీ చేసి స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నారు. సరిగా సమాధానాలు ఇవ్వని వారిని మళ్లీ పోలీస్ స్టేషన్కు పిలిపిస్తున్నారు. కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ఐదు స్పెషల్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఈ బృందాలు రంగంలోనికి దిగాయి. హైదరాబాద్ నగరంలో మకాం వేసిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో మరో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకున్నారు.
అలాంటి పోస్టులు చేస్తున్నవారికి నోటీసులు : స్థానిక వాట్సాప్ గ్రూప్‌లపైనా పోలీసులు మరింత నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులను పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక వాట్సాప్ గ్రూప్‌ల్లో వైరల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ గ్రూప్‌లపై నిఘా ఉంచి వాటి అడ్మిన్‌లు, సభ్యులను గుర్తించి, 500 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో పలువురికి నోటీసులు ఇవ్వగా ఆ గ్రూప్‌ల్లోని సభ్యులు వాటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు.