AP Officials on Free Bus Scheme in Andhra Pradesh :ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే సగటున రోజుకు 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఆ సంస్థ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 2 వేల బస్సులతో పాటు 11 వేల 500 మంది సిబ్బందిని నియమించాలని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఉచిత బస్సుతో ఎంత రాబడి తగ్గుతుంది, ఏయే బస్సులకు డిమాండ్ ఉంటుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. తాజాగా ఈ పథకంపై అధ్యయనం చేయడానికి ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
ఈ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్న ఫ్రీ బస్సు ప్రయాణం అమలు తీరుతో పాటు అధికారులు ఇచ్చిన నివేదికపైనా పరిశీలన చేయనుంది. ప్రస్తుతం ఏపీలో సుమారు 44 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో పాస్‌హోల్డర్లు కాకుండా రోజుకు 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం చేస్తారు. వీరిలో అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించే వారు సుమారు 3 లక్షల మంది దాకా ఉన్నారు. మిగిలిన 24 లక్షల మంది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం, విజయవాడలోని సిటీ ఆర్డినరీ ప్రయాణికులు ఉన్నారని, రోజుకు ప్రయాణికుల సంఖ్య 10 లక్షల వరకు పెరుగుతుందని ఏపీ అధికారులు అంచనా వేస్తున్నారు.
అదనంగా 2 వేల బస్సులు కావాలని : ప్రస్తుతం నిత్యం బస్సు ప్రయాణం చేసేవారిలో 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు ఉన్నారని, స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే వారి సంఖ్య 60 శాతానికి పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 68-69 శాతం ఉండగా అది 95 శాతానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తే అక్కడి ఓఆర్ 95 శాతానికి చేరిందని, ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఐదు రకాల సర్వీసులు కలిపి అదనంగా 2 వేల బస్సులు కావాలని అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే 5 వేల డ్రైవర్లు, మరో 5 వేల కండక్టర్లు, 1500 మంది మెకానిక్‌లు ఇతర సిబ్బంది కలిపి మొత్తం 11 వేల 500 ఉద్యోగులు అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్టీసీ టికెట్ల ద్వారా రోజు వారీ రాబడి రూ.16 నుంచి 17 కోట్లు ఉండగా, ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా రూ.6 నుంచి రూ.7 కోట్లు వస్తోంది. వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆ రాబడిని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెలకు సగటున సుమారు రూ.200 కోట్లు వరకు ఏపీ ఆర్టీసీ కోల్పోతుంది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల వరకు జీతాలు చెల్లిస్తోంది.
ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ - ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ డేట్ ఫిక్స్? - Free Bus for Women in AP