Aishwarya Rai Jodha Akbar Lehenga : బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటన, డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి ఎంతో మంది ఫాలో అవుతుంటారు. అయితే తాజాగా ఆమెకు ఓ అరుదైన గౌరవం దక్కింది. 2008 విడుదలై సూపర్ హిట్ మూవీ 'జోధా అక్బర్'లో ఐశ్వర్య ధరించిన లెహెంగాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియంలో ఉంచనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ అకాడమీ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ పెట్టింది.
"ఆ సినిమాలో రాణికి ఈ లెహెంగా మరింత అందాన్ని తెచ్చింది. వెండి తెరపై ఎంతోమందిని ఆకర్షించిన ఆ లెహెంగానూ ప్రముఖ ఆస్కార్ మ్యూజియంలో ప్రదర్శించనున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది" అని అకాడమీ తమ ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. "డియర్ హాలీవుడ్ ఇంతకుమించిన అందాన్ని కనిపెట్టండి చూద్దాం" అంటూ ఓ అభిమాని కామెంట్ చేయగా, "ఆ మ్యూజియం ఇకపై మరింత అందంగా కనిపిస్తుంది" అంటూ మరొక నెటిజన్ పేర్కొన్నారు. అయితే అకాడమీ మ్యూజియంలో కనిపించనున్న మొదటి ఇండియన్ డ్రెస్ కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ లెహెంగాను డిజైన్ చేసిన నీతా లుల్లాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక జోధా అక్బర్ విషయానికి వస్తే, 2008లో విడుదలైన ఈ హిస్టారికల్ మూవీలో అక్బర్ పాత్రలో హృతిక్ రోషన్ మెరవగా, జోధా రాణిగా ఐశ్వర్యరాయ్ కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలో నటీనటులు ధరించిన దుస్తులు అప్పట్లోనే అందరి దృష్టిని ఆకర్షించాయి. దాంతో పాటు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక ఐశ్వర్యరాయ్ చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్-2'లో కనిపించారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. అంతేకాకుండా ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకున్నారు. అయితే త్వరలో తన భర్త అభిషేక్‌తో కలిసి మణిరత్నం డైరెక్ట్ చేసే సినిమాలో నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.