TTD Board Members Demand to Inquiry on Parakamani Scam In Tirumala : తిరుపతిలోని పరకామణిలో రూ.100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని టీటీడీ పాలక మండల మెంబర్ భాను ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడికి వినతి పత్రం ఇచ్చారు. పరకామణిలో పెద్దజీయర్ తరఫున సి.వి. రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన రహస్యంగా దాదాపు రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు వెల్లువెత్తాయని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్ ద్వారా తన శరీరంలో రహస్య అర కూడా పెట్టించుకున్నారని అన్నారు.
ఏఐ సాంకేతికతతో తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం - టీటీడీ బోర్డు సమావేశంలో కీలక తీర్మానాలు
2023 ఏప్రిల్ 29న సి.వి. రవికుమార్ శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వెంటనే విజిలెన్స్ సహాయ భద్రతాధికారి సతీష్ కుమార్, పోలీసులకు ఫిర్యాదు చేయగా రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. అయితే నిందితుడిని అరెస్టు చేయకుండా అదే సంవత్సరం సెప్టెంబర్‌లో లోక్ అదాలత్‌లో రాజీకి వచ్చారని వివరించారు. అప్పటి టీటీడీ అధికారులు కొందరు, పోలీసులు, నాటి టీటీడీ ఛైర్మన్ కలిసి రవికుమార్‌ను బెదిరించి రూ.100 కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు.