Andhra Pradesh Assembly Sessions 2024: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ - బీఏసీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. గవర్నర్ ప్రసంగంపై రేపు చర్చ జరగనుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం రేపే సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు - ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించనున్నారు. ప్రతిపక్ష హోదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ఈ సమావేశాల్లోనూ ఫ్రీ సీటింగ్ విధానాన్నే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరుతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ముగియనున్నందున కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా, ప్రస్తుత సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, రాబడి తదితర అంశాలపై పూర్తి స్థాయి సమాచారం వచ్చాక అంతా అధ్యయనం చేసి అక్టోబర్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతవరకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ రాటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
5 ఏళ్ల తర్వాత మీడియా పాయింట్: శాసనసభ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్‌లు ఇవ్వనున్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో సందర్శకులు పెద్దఎత్తున రావడంతో గ్యాలరీలు కిక్కిరిశాయి. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ్యులకూ ఇబ్బంది కలిగింది. దీంతో ప్రస్తుత సమావేశాలకు సందర్శకులను వెంట తీసుకురావద్దని ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇక శాసనసభ మీడియా పాయింట్‌ను 5 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. ఇక్కడి నుంచే ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రసారాలు ఇవ్వనున్నారు.