శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు సోదరుడిని కస్టడీకి తీసుకుని విచారణ An IAS Involved in HMDA Ex Director Shiva BalaKrishna Case : హెచ్ఎండీఏ, రెరాలో శివబాలకృష్ణ పనిచేసిన సమయంలో అధికారం అడ్డం పెట్టుకొని వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 8 రోజుల పాటు తమ అదుపులోకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులు, అనేక విషయాలను రాబట్టగలిగారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆక్రమాలు చేయడంలో ఆరితేరిన బాలకృష్ణ, తొలుత నోరు విప్పేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఆయన హయాంలో ఇచ్చిన అనుమతులు, వాటి ద్వారా పొందిన లబ్ది, బినామీ ఆస్తులు, ఇతర అధికారులతో ఉన్న సంబంధాల వంటి వాటి గురించి అధికారులు తరచూ ప్రశ్నించారు.
కానీ చాలా వాటికి శివబాలకృష్ణ మౌనంగా ఉన్నారని సమాచారం. దాంతో లాభం లేదని గ్రహించిన అనిశా అధికారులు, బాలకృష్ణ హెచ్ఎండీఏ, రెరాలో వివిధ స్థిరాస్తి సంస్థలకు ఇచ్చిన అనుమతులకు సంబంధించి సమాచారం సేకరించారు. నిబంధనలు పాటించకపోయినా, కొన్ని సంస్థలకు చకచకా అనుమతులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వాటి వివరాలు దగ్గర పెట్టి ప్రశ్నించారు.
శివబాలకృష్ణ నేరంగీకార పత్రంలో సంచలన విషయాలు - ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన
నిబంధనలు పక్కన పెట్టి అనుమతులు ఇవ్వడానికి గల కారణాల గురించి ఆరా తీశారు. దాంతో అప్పట్లో హెచ్ఎండీఏలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి సూచన మేరకు కొన్నింటికి అనుమతులు ఇవ్వాల్సి వచ్చిందని, ఇందుకు ప్రతిఫలంగా ఆ అధికారి కొన్ని ఆస్తులతో పాటు పెద్దఎత్తున డబ్బు ముట్టజెప్పినట్లు శివబాలకృష్ణ వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా నార్సింగి, మహేశ్వరం తదితర ప్రాంతాల్లోని పలు స్థిరాస్తి సంస్థలతో ఈ లావాదేవీలు జరిగినట్లు తేలడంతో ఆ ఆస్తుల చిట్టా బయటకు లాగుతున్నారు.
శివబాలకృష్ణ బినామీ ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు వంటి వివరాలు ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. స్థిరాస్తి సంస్థలకు అనుమతి, బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఒకే సమయంలో జరిగినట్లు ఏసీబీ నిర్ధారించాల్సి ఉంటుంది. తద్వారా ఉపకారం చేసిన సంస్థలు ప్రతిఫలంగా వీటిని ముట్టజెప్పినట్లు నిర్ధారించినట్లు అవుతుంది. ఇందుకోసం స్థిరాస్తి సంస్థల ప్రతినిధులనూ విచారించనున్నారు. ఇది నిర్ధారణ అయ్యే పక్షంలో సంబంధిత ఐఏఎస్ అధికారిపైనా ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. శివబాలకృష్ణ అడ్డదారిలో కూడబెట్టిన ఆస్తుల సంరక్షణ వ్యవహారమంతా అతడి సోదరుడు శివనవీన్ కనుసన్నల్లోనే సాగిందని ఏసీబీ దర్యాప్తులో తేలింది.
శివబాలకృష్ణపై కేంద్రదర్యాప్తు సంస్థ ఫోకస్- రంగంలోకి దిగిన ఈడీ
హెచ్ఎండీఏ, రెరాల్లో అనుమతుల కోసం వచ్చిన దస్త్రాల్లో లొసుగులు కనిపెట్టడంలో శివబాలకృష్ణ ప్రావీణ్యం కనబరిస్తే, దరఖాస్తుదారులను దారికి తెచ్చుకొని అక్రమార్జనను కూడగట్టడంలో శివనవీన్ పండిపోయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలా అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ఎక్కువగా భూములనే కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ భూములను శివబాలకృష్ణ భార్య, కుమార్తె, కుమారుడితో పాటు తాను, తన భార్య శివఅరుణ, మరో ఇద్దరు బంధువుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించే ప్రక్రియనంతా శివనవీనే పర్యవేక్షించినట్లు తెలిసింది. అలాంటి భూముల్లో ఇప్పటి వరకు గుర్తించింది 214 ఎకరాలే అయినా, ఇంకా భారీగా ఉండి ఉంటాయని ఏసీబీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అరెస్టైన శివనవీన్‌ను కస్టడీకి తీసుకొని విచారించడం ద్వారా మరింత కీలక సమాచారం లభ్యమవుతుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు.
అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలు - శివబాలకృష్ణ 'అక్రమ' లీలలు అన్నీఇన్నీ కావయా!
ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు