Yashoda Employee Fraud in Hyderabad :పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు ఓ కేటుగాడు. ఏకంగా రూ.3.26 కోట్లు పక్కదారి పట్టించాడు. ఉద్యోగులకు చెల్లించే జీతాలజాబితాలో తన కుటుంబసభ్యుల పేర్లు చేర్చి, 2021 మే నుంచి 2023 సెప్టెంబర్ మధ్య ఈ మొత్తం స్వాహా చేశాడు. తీరా నిధుల మళ్లింపును గుర్తించిన యాజమాన్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో గ్రూపులో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన నౌపడ రామ్‌నర్సింగ్ యశోదా ఆసుపత్రి గ్రూపులో మేనేజర్ ఆఫ్ అకౌంట్స్ హోదాలో 2020లో ఉద్యోగంలో చేరాడు. యశోదా గ్రూపు ఆధ్వర్యంలోని యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్యోగులు, యశోదా హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్లకు వేతనాలు, అద్దె, భద్రతా సిబ్బందికి చెల్లింపులు, తదితర వ్యవహారాలను అతను చూస్తుంటాడు. అయితే గత నవంబర్‌లో రామ్‌నర్సింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సంస్థ ఆర్థిక వ్యవహారాలను సమీక్షిస్తునపుడు వేతనాల అడ్వాన్స్ జాబితా కింద అనుమానాస్పద చెల్లింపులు జరిగినట్లు యాజమాన్యం నిర్ధారించింది. బ్యాంకుల లావాదేవీలను పరిశీలించగా సంస్థతో సంబంధం లేని ఖాతాల్లో నిధులు జమైనట్లు తెలిసింది. నౌపడ రామ్‌నర్సింగ్, నౌపడ కామేశ్వరి, పాలెపు శ్రీరామ్‌మూర్తి, వెదురుపర్తి ప్రవీణ పేరిట ఉన్న అకౌంట్లలో ఇవి జమయ్యాయి. రామ్‌నర్సింగ్ తనకున్న అధికారంతో రూ.3.26 కోట్లను మళ్లించి వీరి ఖాతాలో జమ చేయించినట్లు యాజమాన్యం గుర్తించింది.
Hyderabad Theft case: అత్త ఇంటికి అల్లుడు కన్నం.. చివరకు పోలీసులకు చిక్కాడు!