KTR Tweet on Allu Arjun Arrest : సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై సినీ ప్రముఖులతో పాటు వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. అరెస్ట్ సమయంలో పోలీసుల తీరును విపక్ష నేతలు ఖండించారు. జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిని ఇలా అరెస్ట్ చేయడం సరిగాలేదని వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం. ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదు. బన్ని అరెస్టు తీరును ఖండిస్తున్నా, ‘‘అభద్రతాభావం కలిగిన నాయకుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు’’- కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని.. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తొక్కిసలాట ఘటనకు అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని, చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అని వ్యాఖ్యానించారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలని ఆయన ఎక్స్‌లో ప్రశ్నించారు.