ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 రూపాల్లో ముప్పు - టైటిలింగ్‌ చట్టంతో భూమి కోల్పోయే ప్రమాదం - Land Titling Act 2022 - LAND TITLING ACT 2022

Land Titling Act in Andhra Pradesh: తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా సొంతగా కొన్నదైనా మీ భూమికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి మూడు రూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. సమగ్ర రీసర్వే చేసి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వడం ఒక ఎత్తైతే, కొంటే జిరాక్స్‌ పత్రాలివ్వడం మరొక ఎత్తు, ఇక చిట్టచివరిది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌. ఈ మూడూ ప్రమాదకరమైనవే. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో మొత్తం ఆస్తినే మింగేసేలా తయారు చేశారన్న ఆందోళన రైతులు, ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Land Titling Act
Land Titling Act (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 7:40 AM IST

మీ భూమికి 3 రూపాల్లో ముప్పు! - టైటిలింగ్‌ చట్టంతో భూమినే కోల్పోయే ప్రమాదం (ETV Bharat)

Land Titling Act in Andhra Pradesh :ఇంటి స్థలమైనా, పంట పొలమైనా భూమి అంటే ఒక భరోసా. అవసరానికి పనికొస్తుందనే ధైర్యం. భూమినే నమ్ముకున్న రైతు అడుగు నేలనూ ప్రాణంగా భావిస్తారు. అలాంటి మట్టిమనిషి పొలంలో ఐదు సెంట్లు, అరెకరం తగ్గిందంటే తట్టుకోగలరా? వారికేమైనా వైఎస్సార్సీపీ నేతల్లా వందల ఎకరాల ఎస్టేట్‌లున్నాయా, నగరానికో ప్యాలెస్‌లున్నాయా? ఉన్నదే ఎకరం అందులోనూ దోచేస్తామంటే బతికేదెలా? అయినా సీఎం జగన్‌ మాత్రం రీ సర్వే, జిరాక్స్‌ పత్రాలు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా అన్నదాతల నమ్మకాలతో ఆడుకుంటున్నారు. వారసత్వపు హక్కుల్నే హరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నా, మీ భూమి మీది కాదనే పరిస్థితి తెచ్చినా ప్రశ్నించకూడదా? పైపెచ్చు కేసులు పెడతామని బెదిరిస్తారా? అని రైతులు నిలదీస్తున్నారు.

రైతుకు ప్రతి సెంటూ ప్రాణమే :సమగ్ర రీ సర్వే అంటే జగన్‌ బొమ్మలు, సరిహద్దు రాళ్లే వాటి కోసమే వందల కోట్లు పోసినట్లు పరిస్థితి తయారైంది. వాస్తవానికి సమగ్ర రీసర్వే అంటే రైతుల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపేలా ఉండాలి. భూదస్త్రాల స్వచ్ఛీకరణ జరగాలి. కొలతల్లోనూ కచ్చితత్వం అవసరం. వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టిన రీసర్వే కుటుంబాల్లో కొత్త సమస్యలను సృష్టిస్తూ పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టేలా తయారైంది. 2020లో సమగ్ర రీ సర్వే ప్రారంభిస్తే ఇప్పటికి 6వేల గ్రామాల్లోనే పూర్తయింది. నాలుగు గట్ల మధ్య కొలతలేసి అదే సమగ్ర సర్వే అని లెక్కలు రాసి పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. కొలతల్లో తేడాలొస్తే చర్చించి తమ దగ్గరుండే దస్త్రాలతో ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపే చర్యల్లేవు.

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: న్యాయవాదులు - Lawyers on AP Land Titling Act

ఎక్కడికక్కడే ముగించి, మీరే తేల్చుకుని చెప్పాలంటున్నారు. సర్వే నంబరు, సబ్‌ డివిజన్‌ చేసి ఇవ్వాల్సి ఉండగా ఇద్దరు ముగ్గురికి కలిపి ఒకే ల్యాండ్‌ పార్సిల్‌ ఇచ్చి మరోసారి రీసర్వే చేయించుకోమంటున్నారు. పూర్వార్జితంగా వచ్చిన భూమి విస్తీర్ణం తగ్గించి చూపారని రైతులు అడిగితే సరైన పత్రాలు తెచ్చుకుని రుజువు చేసుకోవాలని చెబుతున్నారు. రాయలసీమలోని 75 గ్రామాల్లో 4 నెలల్లోనే రీ సర్వే పూర్తిచేశారంటేనేఎంత హడావుడి తంతో అర్థమవుతోంది. రోజుకు 20నుంచి 30 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉంటే వందెకరాలకు పైగా కొలతలు వేస్తున్నారు. రీ సర్వేలో కొన్నిచోట్ల సెంట్లలో, కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే తగ్గుతోంది. రైతుకు ప్రతి సెంటూ ప్రాణమే అంటుంటే ఇంత పెద్దమొత్తంలో తగ్గుతున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ప్రతిబింబంగా రాజముద్ర :అధికారులు ఇచ్చే పట్టాదారు పాస్‌పుస్తకాలన్నీ తప్పుల తడకే. భూవిస్తీర్ణం, పేర్లు, భూమి స్వభావం, సంక్రమించిన తీరు తదితర అంశాలన్నీ ఇష్టారాజ్యంగా నమోదుచేస్తున్నారు. కొందరికి విస్తీర్ణం పెంచి, మరికొందరికి తగ్గించి నమోదు చేస్తున్నారు. జిరాక్స్‌ పత్రాలు, జగన్‌ బొమ్మలతో కూడిన భూహక్కు పత్రాలను తీసుకుని బ్యాంకులకు వెళ్తే అక్కడి అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో రుణాలు కూడా పొందే వీలుండటం లేదు. తరతరాల అనుబంధం, వారసత్వంగా లభించే భూమి ఆస్తి మాత్రమే కాదు. మా తాతల ఆస్తి తర్వాత నాన్న, పెదనాన్న, బాబాయి, అత్తమ్మలకు భాగపంపిణీ ద్వారా వచ్చిందని అందరినీ గుర్తు చేసుకుంటుంటారు. గ్రామాల్లో ఎవరైనా అటు వెళ్తుంటే ఆ పొలం మా తాతలు అమ్మేశారని ఇప్పటికీ చెబుతుంటారు. భూమితో ఉన్న బంధం అలాంటిది. వాటికి ప్రతిబింబంగా రాజముద్ర కలిగిన పత్రాలు చూడగానే ప్రతి ఒక్కరికి తమ భూమికి సంబంధించి మనసు లోతుల్లోని జ్ఞాపకాలన్నీ ముసురుకుంటాయి. అంత అపురూపంగా చూసుకునే భూమికి జిరాక్స్‌ పత్రాలిస్తారా?

'ఆస్తి హక్కును హరించే చట్టమిది'- ల్యాండ్‌ టైటిలింగ్​తో ఎవరికి మేలో చెప్పండి జగనన్న! - Lawyers Comments on Land Titling

భూమి ఉందని రుజువు చేసుకునేదెలా? :లక్ష రూపాయలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే కార్యాలయం ఇచ్చే స్టాంపుపత్రాలే రైతులకు, స్థలాల యజమానులకు భరోసా. తాత, ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చే పత్రాలను ఎంతో విలువైనవిగా భద్రపరచుకుంటారు. జగన్‌ సర్కారు వాటి స్థానంలో జిరాక్స్‌ పత్రాలిస్తామంటుంటే అది రైతుల నమ్మకాన్ని చంపేయడం కాదా? భూమి మీదేనని రుజువేంటి అని ఇప్పుడు రీసర్వేలో అధికారులు ప్రశ్నిస్తుంటే రిజిస్ట్రేషన్‌ పత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపిస్తున్నారు. ఇకనుంచి అవి లేవంటే రైతులు భూమి ఉందని రుజువు చేసుకునేదెలా? పెద్దమనుషులు పలుకుబడి ఉపయోగించి అరాచకంగా రాత్రికి రాత్రే తమ పేరుతో మార్చేసుకుంటే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి?

రాత్రికి రాత్రే పేర్లు మార్పు : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చట్టం అమల్లోకి వస్తే సామాన్య రైతుల పరిస్థితిని ఊహించలేం. వారి సమస్యలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. నేతలు భూమిని గుంజుకుంటున్నా మౌనంగా భరించాల్సిందే. ఇప్పుడే ఆ చట్టం పేరు చెప్పి చాలాచోట్ల అధికారులు రైతుల్ని బెదిరిస్తున్నారు. రెండుమూడు సెంట్ల తేడా సృష్టించేదీ వారే. నీదైతే రుజువు చేసుకోవాలని చెప్పేదీ వారే. ప్రభుత్వమే నియమించే టైటిలింగ్‌ అధికారికి అప్పీలు చేసినా న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో భూముల యజమానుల్లో చాలామంది ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్నారు. ఆ భూమి పరిస్థితేంటో కూడా వారికి తెలియదు. వాటి రిజిస్ట్రేషన్‌ పత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు తమ దగ్గరున్నాయనే ధీమాలో ఉంటారు. రాబోయే రోజుల్లో రాత్రికి రాత్రే పేర్లు మార్చుకున్నా వారికి తెలియదు. తర్వాత ఎప్పటికో తెలుసుకున్నా అప్పటికే భూబదలాయింపు జరిగిపోతుంది. కొత్త హక్కుదారులు వస్తారు. తర్వాత హైకోర్టుకు వెళ్లినా పరిష్కారమయ్యేనాటికి తరాలే మారిపోతాయి.

పాస్‌పుస్తకాలపై జగన్‌ బొమ్మ ఎందుకు? :స్వార్జితంతో ఇల్లు కట్టుకోవాలని, పొలం కొనుక్కోవాలని, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరి ఆశ. తమ కష్టార్జితాన్ని పాస్‌పుస్తకాలు చూస్తూ గుర్తు చేసుకుంటారు. వారసత్వంగా బిడ్డలు, వారి బిడ్డలకు ఇస్తారు. అంతటి విలువైన ఆస్తిపత్రాలపై సీఎం జగన్‌ బొమ్మ వేసుకుంటామంటే ఎవరికైనా ఆగ్రహం రాకుండా ఉంటుందా? ‘తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలపై జగన్‌ బొమ్మ ఎందుకు? ఉంటే మా బొమ్మ ఉండాలి’ అని పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి సీఎం జగన్‌ సతీమణి భారతీరెడ్డిని నిలదీయడమే రైతుల్లో ఆందోళనకు దర్పణం పడుతోంది.

భూములను మింగేసే కొత్త వైరస్!- Bro ఈ Tro ఏమిటి? - Land virus in AP

ABOUT THE AUTHOR

...view details