Comprehensive Family Survey In Telangana :రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. 85 వేల మంది సిబ్బంది. బుధవారం నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. మూడు రోజుల పాటు కుటుంబాలను గుర్తించి ఇంటికి స్టిక్కర్లు అతికిస్తారు. ఈనెల 9 నుంచి 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే డేటా ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
బుధవారం నుంచి ఇంటింటి సర్వే :రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటింటి సర్వే జరగనుంది. కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ నేతృత్వంలో జరిగే ఈ సర్వే కోసం 85వేల మంది ఎన్యుమరేటర్లు సిద్ధం కాగా ఇందులో దాదాపు 40వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి పదిమంది ఎన్యుమరేటర్లకు ఒకరి చొప్పున 8వేల 500 మంది పర్యవేక్షకులను నియమించారు.
ఈనెల 8వరకు ముందుగా కుటుంబాలను గుర్తించి ఇంటింటికి స్టిక్కర్లు వేస్తారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ తర్వాత కుటుంబాలు పెరిగినందున ఈ మూడు రోజుల పాటు వాస్తవ సంఖ్యను గుర్తిస్తారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్కు బాధ్యత అప్పగించారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వగా ప్రశ్నావళితో పాటు ప్యాడ్,పెన్ను, పెన్సిల్ వంటి స్టేషనరీ అందజేశారు.
కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం :ఈనెల 9 నుంచి పూర్తిస్థాయి సర్వే ప్రారంభం కానుంది. గుర్తించిన కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలు సేకరిస్తారు. ప్రధాన ప్రశ్నలు 56, ఉపప్రశ్నలు 19 కలిపి మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల పేర్లతో పాటు అందరి మొబైల్ నంబరు సేకరిస్తారు. కులంతో పాటు ఆ కులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు. కుటుంబ సభ్యుల వారీగా విద్య, చదివిన మాధ్యమం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం తెలుసుకుంటారు. కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిర, చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు.