Akkineni Nagarjuna Clarity on N Convention Demolition: ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించిన స్థలం పట్టా కలిగిన డాక్యుమెంటెడ్ భూమి అని స్పష్టం చేశారు. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని తెలిపారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24 ఫిబ్రవరి 2014న ఒక ఆర్డర్ ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందని నాగార్జున వివరించారు.
ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించామని, న్యాయస్థానం తీర్పునకు తాను కట్టుబడి ఉంటానని అభిమానులు, శ్రేయోభిలాషులకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని సవినయంగా అభ్యర్థిస్తున్నానని తెలిపారు.
ఎన్ కన్వెన్షన్ నేలమట్టం : నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా శనివారం కూల్చేసిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు స్పందించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఈ కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సమగ్ర వివరణ ఇచ్చారు.