Kidney Surgery In AINU : హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండటంతో పాటు వాటిలో కుడివైపు కిడ్నీ ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా కింది భాగంలో ఏర్పడింది. పైగా మామూలుగా కిడ్నీ అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం అవి పాన్ కేక్ మాదిరిగా ఉన్నాయి. 45 ఏళ్లుగా ఆ మహిళ ఇలా పాన్ కేక్ కిడ్నీలతోనే జీవిస్తున్నారు. తాజాగా ఆ రెండింటికీ మధ్యలో క్యాన్సర్ కణితి వచ్చింది. పాన్ కేక్ కిడ్నీలు ఉండటమే అత్యంత అరుదు. 3.75 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలాంటి ప్రదేశంలో క్యాన్సర్ కణితి రావడం మరింత అరుదు.
కలిసిపోయిన కిడ్నీలను ఫ్యూజ్డ్ కిడ్నీ అని, వేరే ప్రదేశంలో ఉండడాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అని అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ రెండింటికీ మధ్యలో కణితి ఏర్పడితే దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. కిడ్నీలకు రక్త సరఫరా చేసే రక్తనాళాలు కూడా ఎక్కడున్నాయో గుర్తించాలి. అందుకే నగరంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు సీటీ స్కాన్ చేసి, దాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించడం ద్వారా 3-డి ఇమేజ్ సృష్టించారు. దాని సాయంతో అసలు కిడ్నీలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటికి రక్త సరఫరా ఎటు నుంచి జరుగుతోంది, కణితి ఎక్కడుందన్న విషయాలను గుర్తించారు. ఈ వివరాలను ఆస్పత్రికి చెందిన రోబోటిక్ అండ్ యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం గౌస్ తెలిపారు.
పాన్‌కేక్‌లా రెండు కిడ్నీలు : “కొంపల్లికి చెందిన 45 ఏళ్ల మహిళ వచ్చినప్పుడు పరీక్షలు చేస్తే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. సిటీ స్కాన్ చేసి చూడగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా అనిపించింది. దాంతో అప్పుడు 3-డి మోడల్ సృష్టించి దాన్ని పరిశీలించగా, రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండటం, కుడివైపు కిడ్నీ ఉండాల్సిన చోట కాకుండా కింద కటి ప్రాంతంలో ఉండడం, ఒక కిడ్నీ ఉండాల్సిన ఆకారంలో కాకుండా పాన్ కేక్‌లా ఉండడం లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో కణితి ఏర్పడడం లాంటివి గుర్తించాము.
సాధారణంగా అయితే ఇలాంటి కణితులను అవి సరిగ్గా ఎక్కడ, ఎంత పరిమాణంలో ఉన్నాయో గమనించడం చాలా కష్టం. అందుకే అత్యంత అరుదుగా చేసే 3-డి మోడలింగ్ పద్ధతిని మేం ఎంచుకున్నాం. దీనివల్ల శస్త్రచికిత్సకు ముందుగానే చేసుకునే ప్లానింగ్ చాలా సులభం అవుతుంది. ఇలాంటి కేసుల్లో కిడ్నీలో కొంత భాగం గానీ, పూర్తి కిడ్నీని గానీ తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో సంక్లిష్లత చూసుకుంటే ఇది పాన్ కేక్ కిడ్నీ కావడం, రక్త సరఫరా కూడా ఇబ్బందికరంగా ఉండడంతో ఓపెన్ శస్త్రచికిత్స చేయడం కుదరని పని. దాంతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కీహోల్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం.