Adilabad to Hyderabad New Railway line :ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో 350 కిలోమీటర్లు. రైలు మార్గంలో 600 కి.మీ రోడ్డుమార్గంలో ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్-కామారెడ్డి(Kamareddy) మీదుగా హైదరాబాద్ వెళ్లేలా 44వ నంబర్ జాతీయ రహదారి ఉంది. అదే రైల్‌మార్గంలో ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని కిన్వట్, ముథ్కేడ్‌కు వెళ్లి తిరిగి నిజామాబాద్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. పైగా అధిక సమయం ప్రయాణించాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో 600 రూపాయలు టికెట్. రైలులో అయితే 150 రూపాయలు. రెండింటి మధ్య 450 రూపాయల వ్యత్యాసం.
జిల్లావాసులు మాత్రం 600 రూపాయలు ఖర్చు చేసి బస్సుల్లోనే వెళ్తారు. కానీ, 150 రూపాయలు కేటాయించి రైలులో వెళ్లడానికి ఆసక్తి చూపరు. కారణం అధిక సమయం ప్రయాణించడం ఒకటైతే, మహారాష్ట్రకు వెళ్లి రావాలనేది మరో కారణం. ఈ విధానంతో ఎప్పుడో విసుగు చెందిన జిల్లావాసులు ఆర్మూర్(Armoor) మీదుగా హైదరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేయాలని విన్నవిస్తున్నారు. దీనికిగాను హైదరాబాద్ నుంచి ఆర్మూర్ నిజామాబాద్ వరకు ఉన్న రైల్వే లైన్‌కు 110 కి.మీ దూరంలో ఉన్న ఆదిలాబాద్ లైన్‌ను అనుసందిచాల్సి ఉంటుంది. దీంతో 3 గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవచ్చు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు ఆదిలాబాద్, మహారాష్ట్రలోని కిన్వట్, ముథ్కేడ్, నాందేడ్ వరకు నిజాం రాజ్యం విస్తరించి ఉండేది.
అప్పట్లో వ్యాపార అవసరాలు, సైన్యం రాకపోకల కోసం నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్ నుంచి 250 కి.మీ దూరంలోని మహారాష్ట్ర పూర్ణ వరకు మీటర్ గేజ్‌తో రైల్వే లైన్ వేసింది. దాంతో ఆదిలాబాద్‌కు తొలి రైల్ లైన్ ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణ అనంతరం కిన్వట్, ముథ్కేడ్, నాందేడ్ మహారాష్ట్రలోకి వెళ్తే. ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చింది. తొంభయ్యో దశకంలో ముథ్కేడ్ వరకు మీటర్‌గేజ్‌గా ఉన్న రైల్వేలైన్ బ్రాడ్‌గేజ్‌గా మారిందే తప్పితే ఆదిలాబాద్ రైల్వేలైన్‌లో కొత్తగా వచ్చిన మార్పు లేమీలేవు. ఫలితంగా రైల్లో హైదరాబాద్ వెళ్లాలంటే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని కిన్వట్, ముథ్కేడ్ నుంచి తిరిగి తెలంగాణలోని నిజామాబాద్(Nizamabad) వచ్చి వెళ్లాల్సి వస్తోంది.
Adilabad to Armoor Railway Line Project :ఒకవేళ ఆర్మూర్ వరకు ఆదిలాబాద్ లైన్‌ను అనుసంధానిస్తే 300 కి.మీల ప్రయాణభారం తగ్గి మూడు గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవచ్చు. తద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాలకు రైల్వేలైన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దాంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపార, వాణిజ్య, విద్యావైద్యానికి పెద్దపీట వేసినట్లు అవుతుందనేది జిల్లావాసుల ఆశ. ఇందుకు ఇప్పటికే ఆర్మూర్ వరకు ఉన్న రైల్వేలైన్‌కు 110 కి.మీ దూరంలోని ఆదిలాబాద్ రైల్వేలైన్‌ను అనుసందించాల్సి ఉంటుంది. దీనికోసం ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని జిల్లా వాసులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పుష్కలమైన సున్నపు రాయి నిక్షేపాలకు పెట్టింది పేరు. పత్తి క్రయవిక్రయాల్లో ఖండాంతర ఖ్యాతిగాంచింది. ఆదిలాబాద్ మీదుగానే కశ్మీర్ నుంచి కన్యాకుమారీ మధ్యన ఉన్న 44 నంబర్ జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారికి అనుగుణంగా కేవలం 110 కి.మీ దూరంలోని ఆదిలాబాద్-ఆర్మూర్ మధ్య రైల్వేలైన్ అనుసంధానం చేస్తే, ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక కారిడార్(Industrial corridor)గా మారుతోంది. సున్నపురాయి, పత్తి, మాంగనీసు, సోయ, వ్యాపారానికి దోహదం చేసినట్లు అవుతుంది. కానీ, ప్రస్తుతం సరైన రైల్వేలైన్ లేనందున జిల్లా అన్నిరంగాల్లో నిరాదరణకు గురవుతోంది. దీనికితోడు ఆపత్కాలంలో రైల్లో హైదరాబాద్‌కు వెళ్లలేని దుస్థితి. ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రులకు వెళ్లాంటే రైళ్లలో కాకుండా తలకుమించిన భారమైనా బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది.
రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా వాసులు ఎప్పటినుంచో కోరుతున్నా తొంభయ్యో దశకం నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరిట కాలయాపణ చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆదిలాబాద్-వయా ఆర్మూర్ హైదరాబాద్ లైన్ తెరమీదకు వస్తోంది. గతంలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రైల్వేలైన్ వేస్తామని ప్రకటించడంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా సోయం బాపురావును, ఇటీవల జిల్లాలోని నలుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి జిల్లా వాసులు బీజేపీకి జైకొట్టారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఇకపోతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పటాన్‌చెరు-ఆదిలాబాద్ రైల్వే పనుల విస్తరణ కోసం 5700 కోట్ల రూపాయలు కేటాయించింది.