Bhujanga Rao Statement on Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్ చేసినట్లు బహిర్గతం కాగా ఆ జాబితాలో జడ్జీలు, జర్నలిస్టులు ఉన్నట్లు కేసులో కీలక నిందితుడు, అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు వాంగ్మూలంలో తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్లు భుజంగరావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీ, అదనపు డీజీపీలు క్షుణ్నంగా సమీక్ష జరిపేవారు కాదని, ట్యాప్ చేసే ప్రతి ఫోన్ నంబర్‌ను పరిశీలించేవారు కాదని ఆయన చెప్పారు.
Judges P hone Tapping in Telangana : ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్‌రావు ఇష్టానుసారంగా వ్యవహరించారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. బీఆర్ఎస్కు మేలు చేకూర్చేందుకు 2018 శాసనసభ ఎన్నికలకు ముందే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్‌ను సంప్రదించిన తర్వాతే ఎస్ఐబీలో ప్రభాకర్‌రావు స్పెషల్ ఆపరేషన్ టీంను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు ఉపఎన్నిక సమయంలో మునుగోడు శివార్లలో రూ.కోటి పట్టుకోగలిగామని పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్ విశ్లేషణపై ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు దృష్టి సారించారని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ట్రోల్ చేసే వ్యక్తుల ఫోన్లపై ప్రణీత్‌రావు బృందం నిఘా పెట్టేదని వెల్లడించారు.
విద్యార్థి సంఘాల నేతల ఫోన్లనూ ట్యాప్ : అనంతరం టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ బృందాలతో క్షేత్రస్థాయి ఆపరేషన్లు నిర్వహించేవారన్న భుజంగరావు బీఆర్ఎస్ను ఇబ్బందిపెట్టే విద్యార్థి సంఘాల నేతల ఫోన్లనూ ట్యాప్ చేసేవారని తెలిపారు. బీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో బయటపడేసేందుకు ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా ఆపరేషన్లు చేపట్టేవారని చెప్పారు. ఈటల రాజేందర్ గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు, హుజూరాబాద్ ఉప ఎన్నిక, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరుద్యోగ యువత ఆందోళనలు, ఎమ్మెల్యేలకు ఎర కేసు లాంటి సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులకు సమాచారం చేరవేసి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరిగేదని పేర్కొన్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు అవసరమైన సమాచారం కోసం ప్రభాకర్‌రావు తమకు ఆదేశాలిచ్చేవారని భుజంగరావు తెలిపారు. హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్ బంక్ వ్యవహారంలో సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, అతడి వ్యాపార భాగస్వామితో సాంబశివరావుకు వివాదం ఏర్పడగా దీన్ని ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్కు 15 కోట్ల నిధులు సమకూర్చాలని శ్రీధర్‌రావుపై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. ఈ క్రమంలో శ్రీధర్‌రావు బీఆర్ఎస్ కోసం ఎస్‌బీఐ నుంచి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు, సాంబశివరావుతో రాజీ కోసం 2 కోట్లు ఇచ్చారని వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గంలో బరిలో దిగడంతో ఆ ఎన్నిక కోసం కేఎంఆర్ పేరిట ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు భుజంగరావు, తిరుపతన్నలు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు చెందిన డబ్బు అడ్డుకోడమే లక్ష్యంగా :బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిల కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ గ్రూప్‌లో సమాచారాన్ని షేర్ చేసుకునేవారని తెలిపారు. కేసీఆర్‌ను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలో చర్చించేవారని భుజంగరావు వెల్లడించారు. కొండల్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులపై కన్నేసి ఉంచడం ద్వారా కామారెడ్డి పోలీసులు 56 లక్షలు స్వాధీనం చేసుకున్నారని తిరుపతన్న పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌కు చెందిన డబ్బు రవాణాను అడ్డుకోడమే లక్ష్యంగా పని చేశామని అదనపు ఎస్పీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇందుకోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.